Chandrababu Naidu: మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై చంద్రబాబు సీరియస్

Chandrababu Naidu Reacts to Woman Tied to Tree Incident in Kuppam
  • కుప్పంలో అప్పు వివాదం, మహిళను చెట్టుకు కట్టేసిన వైనం
  • సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో ఘటన, తీవ్ర కలకలం
  • బాధితురాలిని చెట్టుకు కట్టి వేధించిన వ్యక్తి అరెస్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పట్టపగలు జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే, కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమె భర్త తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప అనే వ్యక్తి వద్ద రూ. 80,000 అప్పుగా తీసుకున్నారు. కాలక్రమేణా వడ్డీ పెరిగి అప్పు భారం అధికమైంది. ఈ క్రమంలో భర్త తిమ్మరాయప్ప భార్యాబిడ్డలను వదిలి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. శిరీష మాత్రం గ్రామంలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.

ఈ నేపథ్యంలో, తనకు రావాల్సిన డబ్బుల కోసం శిరీష ఇంటికి మునికన్నప్ప వెళ్లాడు. అక్కడ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బలవంతంగా ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి, గ్రామస్థులందరూ చూస్తుండగానే సమీపంలోని వేప చెట్టుకు తాడుతో కట్టేశాడు. "డబ్బులు ఎప్పుడు ఇస్తావు?" అంటూ ఆమెను వేధించాడు. ఈ దారుణాన్ని అక్కడున్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించవద్దని పోలీసు ఉన్నతాధికారులను సీఎం తీవ్రంగా హెచ్చరించారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
Chandrababu Naidu
Kuppam
Andhra Pradesh
Woman Abused
Debt
Police Investigation
Viral Video
Sirisha
Munikannappa
Loan

More Telugu News