RBI: ఏటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్.. విరివిగా అందుబాటులోకి 100, 200 నోట్లు

ATMs to Offer More 100 200 Rupee Notes as per RBI Directive
  • డిసెంబర్‌లో 65 శాతంగా ఉన్న లభ్యత తాజాగా 73 శాతానికి చేరిక
  • సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ తాజా నివేదికలో వెల్లడి
  •  సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో చిన్న నోట్లు
దేశంలోని ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లలో (ఏటీఎం) చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్ల లభ్యతను పెంచాలన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆదేశాల అమలులో బ్యాంకులు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఆర్‌బీఐ నిర్దేశించిన సెప్టెంబర్ 30 గడువుకు మూడు నెలల ముందే దేశంలోని 73 శాతం ఏటీఎంలు ఇప్పుడు రూ.100 లేదా రూ.200 నోట్లను కనీసం ఒక క్యాసెట్ నుంచి జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది.

దేశంలోనే అతిపెద్ద నగదు నిర్వహణ సంస్థ అయిన సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఈ గణాంకాలను వెల్లడించింది. ఈ సంస్థ దేశంలోని మొత్తం 2,15,000 ఏటీఎంలలో 73,000 ఏటీఎంలను నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబర్ 2024లో 65 శాతంగా ఉన్న ఈ చిన్న నోట్ల లభ్యత ప్రస్తుతం 73 శాతానికి పెరిగినట్టు ఆ సంస్థ తెలిపింది.

"దేశంలో ఇప్పటికీ 60 శాతం వినియోగదారుల ఖర్చులు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ లావాదేవీల అవసరాలను తీర్చడంలో రూ.100, రూ.200 నోట్ల లభ్యత నేరుగా ఉపయోగపడుతుంది" అని సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ క్యాష్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెంట్ అనుష్ రాఘవన్ పేర్కొన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో ఆర్‌బీఐ జారీచేసిన సర్క్యులర్ ప్రకారం అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30 నాటికి తమ ఏటీఎంలలో కనీసం 75 శాతం వాటిల్లో రూ. 100 లేదా రూ.200 నోట్లను కనీసం ఒక క్యాసెట్ నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. రోజువారీ లావాదేవీలకు విస్తృతంగా ఉపయోగించే చిన్న డినామినేషన్ నోట్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడమే కేంద్ర బ్యాంకు లక్ష్యం. ఈ నిబంధనను 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలకు వర్తింపజేయాలని కూడా ఆర్‌బీఐ పేర్కొంది. 
RBI
Reserve Bank of India
ATM
Automated Teller Machines
Currency Notes
Small Denomination Notes
CMS Infosystems
Cash Management
Indian Economy
Banking

More Telugu News