Donald Trump: అసలు విషయం వేరే ఉంది.. మాక్రాన్ వ్యాఖ్యలపై ట్రంప్

Donald Trump Responds to Macrons Comments on G7 Exit
  • జీ7 సదస్సు నుంచి ముందే వెళ్లడంపై ట్రంప్ వివరణ
  • ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ కోసమేనన్న మాక్రాన్ వాదన తప్పు
  • మాక్రాన్ ప్రచారం కోసమే అలా చెప్పారన్న ట్రంప్
కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు నుంచి తాను త్వరగా వైదొలగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో ఒక పోస్టు పెట్టారు. తన నిష్క్రమణపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రయత్నం కోసమే ట్రంప్ అర్ధంతరంగా వెళ్లిపోతున్నారని మాక్రాన్ వ్యాఖ్యానించారు.

అయితే, మాక్రాన్ చెప్పిన కారణం సరికాదని, అసలు విషయం వేరే ఉందని ట్రంప్ వివరించారు. "ప్రచారం కోసమే పాకులాడే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, నేను జీ7 సదస్సు నుంచి వాషింగ్టన్ డీసీకి తిరిగి వెళ్లింది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసమేనని తప్పుగా చెప్పారు. అది పూర్తిగా అవాస్తవం! నేను వాషింగ్టన్‌కు ఎందుకు వెళ్తున్నానో ఆయనకు తెలియదు, కానీ అది కచ్చితంగా కాల్పుల విరమణకు సంబంధించినది కాదు. అంతకంటే చాలా పెద్ద విషయం. ఉద్దేశపూర్వకంగానో కాదో తెలియదు కానీ, ఇమ్మాన్యుయేల్ ఎప్పుడూ తప్పుగానే చెబుతారు. వేచి చూడండి!" అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
Donald Trump
G7 Summit
Emmanuel Macron
Israel Iran Conflict
Truth Social
US President
Washington DC
France President

More Telugu News