Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్‌పై అనుమానంతో అప్పుడే ఫిర్యాదు చేశాం: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Filed Phone Tapping Complaint Earlier
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా హాజరైన మహేశ్ కుమార్ గౌడ్
  • కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్య
  • టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణ
  • 2022 నుంచి 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌లో ఉన్నాయని వ్యాఖ్య
  • దోషులైన నేతలు, అధికారులకు శిక్ష విధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందనే అనుమానంతోనే అప్పుటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కు ఫిర్యాదు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా తన వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

గత ప్రభుత్వ హయాంలో టెలిగ్రాఫ్ చట్టాన్ని తుంగలో తొక్కి తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. "రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం చాలా నీచమైన చర్య. ఇలాంటి పనికి పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి" అని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో కేవలం బీఆర్ఎస్ నేతలే ఉండాలనే దురుద్దేశంతోనే తమ ఫోన్లను ట్యాప్ చేసి, తమ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని తెలిపారు. రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని, ఈ విషయంపై గతంలోనే ఫిర్యాదు చేశానని, ఇప్పుడు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు.

చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లను ట్యాప్ చేశారని, 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌లో ఉన్నట్లు తెలిసిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సిట్ దర్యాప్తులో సుమారు 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం అందిందని ఆయన వివరించారు.

"కుంభం అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్‌తో పాటు అనేకమంది ఫోన్లు ట్యాప్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ గమనిస్తే, నాడు అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి దుశ్చర్యలకు పాల్పడ్డారో స్పష్టమవుతోంది" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కొందరు అధికారులు, రాజకీయ నాయకులకు దాసోహమై వారి ఆదేశాలను పాటించారని విమర్శించారు. వ్యక్తిగత గోప్యత అనేది తమ ప్రాథమిక హక్కు అని, దానిని కూడా కాలరాశారని అన్నారు.

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, రిటైర్డ్ అయిన ప్రభాకర్‌రావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించి ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడ్డారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. "నక్సలైట్లకు సానుభూతిపరులుగా ఉన్నారని మమ్మల్ని ట్యాప్ చేయడం సిగ్గుచేటు. కేటీఆర్ దీనికి సిగ్గుతో తలదించుకోవాలి" అని ఆయన పునరుద్ఘాటించారు. తమ ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారని, అందుకు వారు కచ్చితంగా శిక్షార్హులని అన్నారు.

భవిష్యత్తులో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడకుండా ఉండాలంటే, ఈ కేసులో దోషులకు కఠిన శిక్షలు పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలకు ఒడిగట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా శిక్ష విధించాలని కోరారు. ఈ కేసు విచారణ సజావుగా జరిపి, బాధ్యులైన రాజకీయ నాయకులు, అధికారులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
Mahesh Kumar Goud
Telangana phone tapping
BRS phone tapping case
KCR phone tapping allegations

More Telugu News