ICC: ఇక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ లు... ఆ జట్లకు మాత్రమే!

ICC Proposes Four Day Tests for Select Teams
  • 2027-29 డబ్ల్యూటీసీలో చిన్న దేశాలకు 4 రోజుల టెస్టులు
  • భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు మాత్రం 5 రోజుల టెస్టులే!
  • చిన్న దేశాల ఖర్చు, సమయం ఆదా కోసమే ఈ నిర్ణయం
  • ఐసీసీ ఛైర్మన్ జై షా ఈ ప్రతిపాదనకు మద్దతు
  • 2025-27 డబ్ల్యూటీసీ యధావిధిగా 5 రోజుల ఫార్మాట్‌లోనే!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆదరణ పెంచే దిశగా, ముఖ్యంగా చిన్న దేశాలకు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, 2027-29 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ నుంచి కొన్ని దేశాల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ భావిస్తోంది.

అయితే, క్రికెట్ ప్రపంచంలో పెద్దన్నలుగా పేరుగాంచిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు మాత్రం సంప్రదాయబద్ధంగా ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లనే ఆడనున్నాయి. ఈ మార్పు ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన, టెస్ట్ క్రికెట్‌ను ఎక్కువగా నిర్వహించలేని చిన్న దేశాలకు ఊరట కల్పించనుంది. ఐదు రోజుల మ్యాచ్ నిర్వహణకు అయ్యే అధిక వ్యయం, సమయం వంటి అంశాలు ఈ దేశాలకు భారంగా మారుతున్నాయి. నాలుగు రోజుల ఫార్మాట్ ద్వారా నిర్వహణ వ్యయం తగ్గడమే కాకుండా, తక్కువ సమయంలో సిరీస్‌లను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు, మూడు టెస్టుల సిరీస్‌ను మూడు వారాల్లోపే ముగించవచ్చు.

గత వారం లార్డ్స్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా సభ్యదేశాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఐసీసీ చైర్మన్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ నాలుగు రోజుల టెస్ట్ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. 

ఐసీసీ 2017లోనే ద్వైపాక్షిక సిరీస్‌లలో సభ్యదేశాల పరస్పర అంగీకారంతో నాలుగు రోజుల టెస్టులు ఆడుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే గతంలో ఇంగ్లండ్ జట్టు ఐర్లాండ్‌తో (2019, 2023), జింబాబ్వేతో (2017) నాలుగు రోజుల టెస్టులు ఆడింది. నాలుగు రోజుల టెస్టుల్లో ప్రతిరోజూ ప్రస్తుతం ఉన్న 90 ఓవర్లటకు బదులుగా 98 ఓవర్ల ఆటను నిర్వహించే అవకాశం ఉంది, తద్వారా మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

కాగా, 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్ మాత్రం యధావిధిగా ఐదు రోజుల ఫార్మాట్‌లోనే కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. 
ICC
World Test Championship
WTC
Test cricket
Four day Test
Cricket Australia
BCCI
Jay Shah
England cricket
Cricket

More Telugu News