Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు అమెరికాలో నిరసన సెగ

Asim Munir Faces Protest in America as Pakistan Army Chief
  • అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు తీవ్ర నిరసన
  • వాషింగ్టన్ హోటల్ వద్ద పాకిస్థానీల ఆందోళన, వ్యతిరేక నినాదాలు
  • "ఫెయిల్డ్ మార్షల్" అంటూ మునీర్‌పై విమర్శలు
  • ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు మునీరే కారణమని పీటీఐ మద్దతుదారుల ఆరోపణ
  • సైనిక సంబంధాల బలోపేతానికి మునీర్ అమెరికా పర్యటన
  • నిరసనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, 'ఫీల్డ్ మార్షల్' జనరల్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉండగా, అక్కడ ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. సొంత దేశానికి చెందిన ప్రజలే ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలుపుతూ, "ఫెయిల్డ్ మార్షల్" అంటూ నినాదాలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.

ఆదివారం అమెరికా చేరుకున్న ఆసిమ్ మునీర్, వాషింగ్టన్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్థాన్‌కు చెందిన పలువురు వ్యక్తులు పెద్ద సంఖ్యలో హోటల్ వెలుపల గుమిగూడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునీర్ హోటల్ భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో, నిరసనకారులు "ఆసిమ్ మునీర్, నువ్వు పిరికివాడివి, సిగ్గులేనివాడివి, సామూహిక హంతకుడివి, నియంతవి" అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని ఆసిమ్ మునీర్ ఖూనీ చేస్తున్నారని వారు ఆరోపించారు.

కొంతకాలం క్రితం 'ఆపరేషన్ సిందూర్' అనంతరం ఆసిమ్ మునీర్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం 'ఫీల్డ్ మార్షల్‌'గా పదోన్నతి కల్పించింది. అయితే, దేశంలోని ఒక వర్గం ప్రజలు ఆయనను "ఫీల్డ్ మార్షల్ కాదు ఫెయిల్డ్ మార్షల్" అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన నిరసనల్లోనూ ఇదే నినాదం ప్రముఖంగా వినిపించింది.

ఈ నిరసనల వెనుక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ మద్దతుదారులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, పీటీఐ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ఆసిమ్ మునీరే కారణమని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మునీర్ అమెరికా పర్యటన ప్రారంభం కావడానికి ముందే, వాషింగ్టన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం వెలుపల కూడా పీటీఐ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఆసిమ్ మునీర్ ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం వాషింగ్టన్ వెళ్లినట్లు పాకిస్థాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ పర్యటన ఆరంభంలోనే సొంత దేశ ప్రజల నుంచి నిరసనలు ఎదురుకావడం గమనార్హం. 

కాగా, అమెరికాలోని పాకిస్థానీయుల చేతికి ఆసిమ్ మునీర్ చిక్కారని, ఆయన నియంతృత్వ, దేశద్రోహ, ప్రజా హంతక ముఖం బయటపడిందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
Asim Munir
Pakistan army chief
Pakistan
Imran Khan
PTI
America protest
Failed marshal
Operation Sindoor
Washington DC

More Telugu News