Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలి: పొంగులేటి

Ponguleti Srinivas Reddy Collectors Must Work According to Government Ideas
  • ధరణి పోర్టల్ వల్ల ప్రతి గ్రామంలో భూ సమస్యలు ఉన్నాయన్న పొంగులేటి
  • భూ భారతి చట్టం ద్వారా సమస్యలకు పరిష్కారం చూపాలని సూచన
  • ప్రజాపాలన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలన్న మంత్రి
గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో వందలాది కుటుంబాలు తీవ్ర భూ సమస్యలతో సతమతమవుతున్నాయని, తెలంగాణ సమాజంలో భూమి అత్యంత కీలకమైన అంశమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటినీ 'భూ భారతి' చట్టం ద్వారా పరిష్కరించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో పలువురు నూతన కలెక్టర్లు, అధికారులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ధరణి పోర్టల్‌తో తలెత్తిన చిక్కుల వల్ల రైతులు, ప్రజలు పడిన కష్టాలకు చరమగీతం పాడాలన్నారు. 'భూ భారతి', రెవెన్యూ సదస్సుల ద్వారా వస్తున్న దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాబోయే రెండు నెలలు రెవెన్యూ శాఖకు చాలా కీలకమైనవని, భూ సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన ఆగస్టు 15వ తేదీ నాటికి చట్టబద్ధమైన అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన మొదలై సుమారు ఏడాదిన్నర కావస్తోందని మంత్రి గుర్తుచేశారు. ఎవరూ ఊహించని రీతిలో భూ సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాల్సిన బృహత్తర బాధ్యత కలెక్టర్లపై ఉందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కలెక్టర్లు కూడా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

మంత్రిని కలిసిన వారిలో కొత్తగా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్‌ హైమావ‌తి, హైద‌రాబాద్ కలెక్టర్ హ‌రిచంద‌న‌, నిజామాబాద్ కలెక్టర్ విన‌య‌కృష్ణారెడ్డితో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ స్పెష‌ల్ సెక్రట‌రీ రాజీవ్‌గాంధీ హ‌నుమంత్ ఉన్నారు.

Ponguleti Srinivas Reddy
Dharani portal
Bhu Bharathi
Telangana land issues
Revenue department
Collectors meeting
Revanth Reddy
Land reforms
Sangareddy collector
Nizamabad collector

More Telugu News