Chandrababu Naidu: ఏడాదిలోనే మెరుగైన ఫలితాలు... ఇది మంచి పరిణామం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on AP Economic Growth and Development
  • ప్రణాళిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్డీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ పై చర్చ
  • వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్డీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ వంటి అంశాలపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ దృష్టి సారించాల్సిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. సంక్షేమానికి వనరులు లభ్యత పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని, ఆర్థిక సుస్థిరత కోసం సేవల రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై విభిన్న మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని అన్నారు. తలసరి ఆదాయంలో ఏడాదిలోనే మెరుగైన ఫలితాలు మంచి పరిణామం అని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలకు మార్గ నిర్దేశం చేయడంలో ప్రణాళిక విభాగం కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు.

గతానికంటే ఎక్కువగా ప్రణాళిక శాఖకు తాను ప్రాధాన్యమిస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి శాఖ మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక శాఖే బాధ్యత తీసుకోవాలన్నారు. రుణ భారం తగ్గించుకోవడం, సంక్షేమానికి వనరులు సమకూర్చుకోవడం వంటివి అత్యంత కీలక అంశాలని చంద్రబాబు వివరించారు. వనరుల సమీకరణలో రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. 

పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ నిరంతరం జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 25 కెబినెట్ సమావేశాలు, 6 ఎస్ఐబీపీ సమావేశాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇక్కడితో ఆగకుండా.. ఆ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చూస్తున్నామన్నారు.

సాంకేతికతతో సమాచార విశ్లేషణ

కచ్చితమైన ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం లెక్కల్లో జాతీయ స్థాయికి మించి ఏపీ పురోగతిని సాధించిందని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 8.7 శాతం మేర పెరిగితే.. ఏపీ 11.89 శాతం మేర పురోగతి నమోదు చేసిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన డేటా అనలిటిక్స్ కోసం టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర, జిల్లా, మండలాలతో పాటు గ్రామ స్థాయిలో కూడా కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే.. క్షేత్ర స్థాయి నుంచి పోటీతత్వం పెరుగుతుందన్నారు. 2028-29 నాటికి 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అభివృద్ధి సూచికలే కీలకం

నెలవారీ అభివృద్ధి సూచికల ద్వారా ఎప్పటికప్పుడు పనితీరును సమీక్షించుకునే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు సూచించారు. దీని వల్ల ఎప్పుడైనా లోటుపాట్లు ఉంటే తక్షణం సవరించుకునే అవకాశం ఉంటుందన్నారు. రిజర్వాయర్లు, నేలలో తేమ శాతం, భూగర్బ జలాల వివరాలు వంటివి నమోదు చేసి వివరాలు తీసుకునే బాధ్యతను ప్రణాళిక శాఖ తీసుకోవాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన పంటల్లో గ్రాస్ వాల్యూ ఎడిషన్ తో పాటు సేవల రంగంలో పెట్టుబడులు పెరిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పీ-4లో బంగారు కుటుంబాలు-మార్గదర్శుల మధ్య సమన్వయం చేసుకునే ప్రక్రియను ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మెరుగ్గా ప్రజాభిప్రాయ సేకరణ

ప్రభుత్వ సేవలు, విభాగాల పనితీరు మీద నిరంతరం ప్రజాభిప్రాయం తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి చేరేలా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, క్యూఆర్ కోడ్ విధానాల ద్వారా ప్రస్తుతం చేపడుతున్న అభిప్రాయ సేకరణతోపాటు.. మరిన్ని భిన్నమైన మార్గాల ద్వారా కచ్చితమైన సమాచారం రాబట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సహా ప్రణాళిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP Economy
Economic Development
GSDP
Per Capita Income
Planning Department
Investments
AP Brand Promotion
Data Analytics

More Telugu News