Donald Trump: ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు.. కానీ ప్రస్తుతానికి వదిలేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్

Trump says US knows exactly where Khamenei is hiding but wont kill him for now
  • ఖమేనీపై ప్రస్తుతానికి చర్యలుండవన్న ట్రంప్
  • ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్
  • ఆ దేశ గగనతలంపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్య
  • సామాన్యులు, అమెరికా సైనికులపై క్షిపణి దాడులు వద్దని హెచ్చరిక
  • జీ7 సదస్సు నుంచి త్వరగా వెళ్లడం ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కోసం కాదన్న ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు కచ్చితంగా తెలుసని, ఆయనో సులభమైన లక్ష్యమే అయినప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పేజీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణులతో దాడులు చేయవద్దని, తమ సహనం నశిస్తోందని ఆయన హెచ్చరించారు.

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని కూడా ట్రంప్ డిమాండ్ చేశారు. ఇరాన్‌ వద్ద మంచి స్కై ట్రాకర్లు, రక్షణ పరికరాలు ఉన్నప్పటికీ, వాటిని అమెరికా తయారుచేసిన వాటితో పోల్చలేమని, ఇరాన్ గగనతలంపై ఇప్పుడు తమకు పూర్తి నియంత్రణ ఉందని మరో పోస్టులో ట్రంప్ తెలిపారు.  అంతకుముందు కెనడియన్ రాకీస్‌లో జరుగుతున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) సదస్సు నుంచి ట్రంప్ ఆగమేఘాలపై వాషింగ్టన్‌కు తిరిగి వచ్చారు. అయితే, ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంతో తన నిష్క్రమణకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 

ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసమే తాను వాషింగ్టన్‌కు వెళ్తున్నానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తప్పుగా చెప్పారని ట్రంప్ విమర్శించారు. తన పర్యటన ఉద్దేశం అంతకంటే చాలా పెద్దదని, త్వరలో వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం ప్రారంభమైన ఘర్షణలు మంగళవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
Donald Trump
Iran
Ayatollah Ali Khamenei
Israel
US relations
Iran supreme leader
Iran Israel conflict
Middle East tensions
Trump Iran policy
G7 summit

More Telugu News