Narendra Modi: భారత్-పాక్ ఒప్పందంలో మీ జోక్యం సున్నా.. నేరుగా ట్రంప్‌తో చెప్పేసిన మోదీ

Modi tells Trump no US involvement in India Pakistan deal
  • ట్రంప్‌తో ప్రధాని మోదీ కీలక ఫోన్ సంభాషణ
  • భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై అసలు విషయం వెల్లడి
  • ఒప్పందంలో అమెరికా పాత్ర ఏమాత్రం లేదని స్పష్టీకరణ
  • పాకిస్థాన్ అభ్యర్థన మేరకే 'ఆపరేషన్ సిందూర్' నిలిపివేశామన్న మోదీ
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్రేమీ లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌కు తేల్చి చెప్పారు. ఇద్దరి మధ్య దాదాపు 35 నిమిషాలపాటు జరిగిన ఫోన్ సంభాషణలో మోదీ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. భారత్-పాకిస్థాన్ మధ్య అప్పట్లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని మోదీ తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అలాగే, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ కావడానికి ముందు ఇద్దరి మధ్య ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ కుదర్చినట్టు ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. ఈ విషయంలో అమెరికా ప్రమేయం ఎంతమాత్రమూ లేదని సూటిగా చెప్పారు. ఆ సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వెనుక అమెరికా మధ్యవర్తిత్వం ఉందంటూ వచ్చిన వార్తలను ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ఖండించారు. కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షికమని, ఇందులో మూడో దేశ ప్రమేయం ఎంతమాత్రం లేదని ట్రంప్‌కు వివరించారు.

పాకిస్థాన్ పదేపదే అభ్యర్థించడం వల్లే తాము ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేయాల్సి వచ్చిందని కూడా ప్రధాని మోదీ ట్రంప్‌కు తెలియజేశారు. ఈ విషయంలో అమెరికా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, అలాంటి ప్రమేయానికి ఆస్కారమే లేదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం.

ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆ కాలంలో ఏదైనా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అటువంటిదేమీ లేదని, ఆ సమయంలో భారత్-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ విషయంలో అమెరికా జోక్యం ఉందంటూ వస్తున్న విమర్శలకు తెరపడినట్టయింది.
Narendra Modi
India Pakistan ceasefire
Donald Trump
India US relations
Operation Sindoor
India Pakistan agreement
bilateral talks
trade deal
ceasefire agreement

More Telugu News