KTR: ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం

KTR Given Ultimatum by ACB in Formula E Race Case
  • ఫోన్, ల్యాప్‌టాప్ ఇవ్వాల్సిందేనన్న అధికారులు.. నేటి సాయంత్రమే డెడ్ లైన్
  • లీగల్ ఒపీనియన్ తీసుకున్న మాజీ మంత్రి
  • కేటీఆర్, అరవింద్ కుమార్ జాయింట్ విచారణకు ఏసీబీ ప్లాన్
  • వాట్సాప్ ఆదేశాలపై ఏసీబీ ఆరా.. ఫార్ములా ఈ నిధుల మళ్లింపులో కేటీఆర్ పాత్ర?
తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఈరోజు సాయంత్రంలోగా తమకు అందజేయాలని గడువు విధించారు. అయితే, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీకి ఇవ్వడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు వాటిని ఏసీబీకి అప్పగించాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన మొబైల్, ల్యాప్‌టాప్‌లను ఏసీబీకి సమర్పించే అవకాశం లేదని తెలుస్తోంది.

మరోవైపు, ఈ కేసులో కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను కలిపి విచారించేందుకు ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అరవింద్ కుమార్ ఈ నెల 21న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత వారం రోజుల్లోగా ఇద్దరినీ ఉమ్మడిగా విచారించేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే అరవింద్ కుమార్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈవోకు నిధుల బదిలీ వ్యవహారంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను నడుచుకున్నానని అరవింద్ కుమార్ ఇదివరకే ఏసీబీకి స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

ముఖ్యంగా, హెచ్‌ఎండీఏ ఖాతాల నుంచి ఎఫ్‌ఈవో సంస్థకు నిధులు విడుదల చేయడానికి సంబంధించి కేటీఆర్ తన వాట్సాప్ ద్వారా అరవింద్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాట్సాప్ సంభాషణల గురించి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణలో వివరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో ఉపయోగించిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను అప్పగించాలని కేటీఆర్‌ను ఏసీబీ కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న అరవింద్ కుమార్ వ్యక్తిగత సెలవుపై విదేశాలకు వెళ్లడంపై ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఆయన సెలవును రద్దు చేసి తక్షణమే విధుల్లో చేరాలని సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.
KTR
Formula E Race
ACB Investigation
Arvind Kumar IAS
Telangana
FEV Fund Transfer
HMDA Funds
WhatsApp Messages
Corruption Case

More Telugu News