Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ ఊచ‌కోత‌.. 49 బంతుల్లో 106 ర‌న్స్‌.. రోహిత్ రికార్డు స‌మం!

Glenn Maxwell Scores Century in MLC 2025 Matches Rohit Sharma Record
  • ఎంఎల్‌సీలో 49 బంతుల్లో అజేయంగా 106 ప‌రుగులు బాదిన మ్యాక్సీ
  • టీ20ల్లో అత‌నికి ఇది ఎనిమిదో సెంచరీ 
  • రోహిత్ శర్మ, వార్నర్, బట్లర్‌ల రికార్డు సమం
  • వాషింగ్టన్ ఫ్రీడమ్‌కు కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్ జోరు
ఆసీస్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ టీ20 క్రికెట్‌లో మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2025 సీజన్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మ్యాక్స్‌వెల్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అజేయ శతకం (106) బాది, పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఓక్‌లాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ భారీ షాట్లతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. కేవలం 49 బంతుల్లోనే 2 ఫోర్లు, 13 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 216.33గా నమోదు కావడం విశేషం. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాక్సీ టీ20 క్రికెట్‌లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 

దీంతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్, ఆస్ట్రేలియాకే చెందిన మైఖేల్ క్లింగర్‌ల సరసన సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 463 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (11), దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రోసౌ, భారత స్టార్ విరాట్ కోహ్లీ (తలా 9 సెంచరీలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ సెంచరీతో మాక్స్‌వెల్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 10,500కు పైగా పరుగులు, 170కి పైగా వికెట్లు, ఐదుకు పైగా సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. మాక్స్‌వెల్ ఇప్పటివరకు టీ20ల్లో 10,500 పరుగులు పూర్తి చేయడంతో పాటు 178 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక‌, గతేడాది స్టీవ్ స్మిత్ నాయకత్వంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు ఎంఎల్‌సీ టైటిల్ గెలవగా, ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Glenn Maxwell
Maxwell century
Major League Cricket
MLC 2025
Washington Freedom
Los Angeles Knight Riders
T20 cricket
Rohit Sharma
Chris Gayle
T20 records

More Telugu News