Virat Kohli: లండ‌న్‌లోని కోహ్లీ ఇంటికెళ్లిన గిల్‌, పంత్

Virat Kohli Meets Shubman Gill Rishabh Pant At His Home In London
  • లండన్‌లోని తన ఇంటికి గిల్, పంత్, సిరాజ్‌లను ఆహ్వానించిన‌ కోహ్లీ
  • కొన్ని గంటల పాటు కోహ్లీతో గడిపిన యువ క్రికెటర్లు
  • జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ కీలక టెస్ట్ సిరీస్
  • గిల్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా, భారత జట్టు త్వరలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా జూన్ 20 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ హెడింగ్లీలో ప్రారంభం కానుంది. ఈ కీలకమైన సిరీస్‌కు ముందు భారత జట్టు కొత్త‌ టెస్ట్ కెప్టెన్ శుభమన్‌ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్‌ పంత్‌, పేసర్ మహ్మద్‌ సిరాజ్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లను కోహ్లీ లండన్‌లోని తన నివాసానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వీరంతా కోహ్లీ ఇంట్లో కొన్ని గంటల పాటు ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారని సమాచారం.

టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌కు ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం. ఐపీఎల్ సీజన్ మధ్యలో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీసీసీఐ సెలక్టర్లు యువ ఆటగాడైన గిల్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఈ ఇంగ్లండ్ సిరీస్‌తోనే టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కొత్త సైకిల్‌ను ప్రారంభించనుంది. గత డబ్ల్యూటీసీ సీజన్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని అందరూ భావించినప్పటికీ చివరికి నిరాశే ఎదురైంది.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకంగా మారింది. కొత్త డబ్ల్యూటీసీ సీజ‌న్‌ను టీమిండియా విజయంతో ప్రస్థానం మొదలుపెట్టాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడితో యువ ఆటగాళ్లు సమయం గడపడం, వారి మధ్య చర్చలు జరగడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
Virat Kohli
Shubman Gill
Rishabh Pant
India vs England
India cricket
Test series
WTC
World Test Championship
Rohit Sharma
Indian cricket team

More Telugu News