Copenhagen: యుద్ధ మేఘాల మధ్య నివాసానికి బెస్ట్ సిటీగా ‘కోపెన్ హాగన్’

Copenhagen Named Worlds Best City To Live In
  • నివాసయోగ్య నగరాల్లో డెన్మార్క్ రాజధాని అగ్రస్థానం
  • ఈఐయూ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025 విడుదల
  • వియన్నాను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్
  • లండన్, మాంచెస్టర్, ఎడిన్‌బరో నగరాల ర్యాంకులు తగ్గుముఖం 
ప్రపంచంలో జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్ నిలిచింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన "గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025"లో ఈ విషయం వెల్లడైంది. గత మూడేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న వియన్నాను వెనక్కి నెట్టి కోపెన్‌హాగన్ ఈసారి మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. స్థిరత్వం, విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో కోపెన్‌హాగన్ 100కి 100 మార్కులు సాధించడం విశేషం.

ఈఐయూ నివేదిక కోసం ప్రపంచవ్యాప్తంగా 173 నగరాలను 30 అంశాల ఆధారంగా విశ్లేషించారు. ఇందులో స్థిరత్వం, వైద్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాలు వంటి కీలక విభాగాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఏడాది నగరాల సగటు స్కోరు 100కి 76.12గా నిలకడగా ఉంది.

ఈ జాబితాలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నాలుగో స్థానంలో నిలవగా, సిడ్నీ, అడిలైడ్ నగరాలు కూడా టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి. జపాన్, న్యూజిలాండ్, కెనడా దేశాలకు చెందిన నగరాలు కూడా ఉత్తమ స్థానాల్లో నిలిచాయి. కెనడాలోని వాంకోవర్ పదో స్థానంలో ఉంది.

అయితే, లండన్ వంటి ప్రఖ్యాత నగరాలు ఈసారి తమ ర్యాంకులను కోల్పోయాయి. అల్లర్లు, నిరాశ్రయుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో లండన్ గత ఏడాది 45వ స్థానం నుంచి ఈసారి 54వ స్థానానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్, మాంచెస్టర్, ఎడిన్‌బరో నగరాల ర్యాంకులు తగ్గినట్లు తెలిపింది. ఉత్తర అమెరికాలోని 21 నగరాలు 80కి పైగా స్కోర్‌తో నివాసానికి అత్యంత అనుకూలమైనవిగా నిలిచాయి. అమెరికాలో హవాయిలోని హోనొలులు 23వ స్థానంతో ఉత్తమ నగరంగా నిలిచింది.

మరోవైపు, సౌదీ అరేబియా, యూఏఈలలో వైద్య, విద్యా రంగాల్లో వచ్చిన పురోగతి కారణంగా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంత నగరాలు నివాసయోగ్యతలో మంచి వృద్ధిని కనబరిచాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా వైద్యం, విద్య, మౌలిక వసతుల సగటు స్కోర్లు స్వల్పంగా మెరుగుపడినట్లు నివేదిక వెల్లడించింది.

ఈ జాబితాలో సిరియా రాజధాని డమాస్కస్ నివాసానికి అత్యంత అననుకూల నగరంగా అట్టడుగున నిలిచింది. లిబియాలోని ట్రిపోలి చివరి నుంచి రెండో స్థానంలో, బంగ్లాదేశ్‌లోని ఢాకా మూడో స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్‌లోని కరాచీ, అల్జీరియాలోని అల్జీర్స్ నగరాలు కూడా నివాసానికి తక్కువ అనుకూలమైన నగరాల జాబితాలో ఉన్నాయి.
Copenhagen
Global Livability Index 2024
Denmark
Economist Intelligence Unit
Vienna
Most Livable City
City Rankings
Quality of Life
Melbourne
Sydney

More Telugu News