Veeru alias Maan Singh Jatav: నాన్న ముఖంపై అంకుల్ దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాడు.. తల్లి ఘాతుకాన్ని వివరించిన 9 ఏళ్ల కుమారుడు!

Rajasthan Man Killed by Wife Lover Alwar Crime News
  • తొమ్మిదేళ్ల కొడుకే ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి
  • రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా ఖేర్లీలో ఈ నెల 7న ఘటన
  • వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • భార్య, ప్రియుడు సహా ఒక కిరాయి హంతకుడి అరెస్ట్
కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చిన దారుణ ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి కీలక సాక్షిగా మారాడు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా ఖేర్లీ ప్రాంతంలో ఈ నెల 7న రాత్రి చోటుచేసుకుంది. వీరూ అలియాస్ మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కన్పించాడు. అనారోగ్యం కారణంగా తన భర్త అకస్మాత్తుగా మరణించాడని ఆయన భార్య అనిత తొలుత అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, వారి కుమారుడు పోలీసులకు అసలు విషయం చెప్పడంతో, 48 గంటల్లోనే ఈ హత్య వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి వచ్చాయి.

చిన్నారి కళ్లెదుటే దారుణం
తొమ్మిదేళ్ల బాలుడు చెప్పిన వివరాల ప్రకారం.. 7వ తేదీ రాత్రి తన తల్లి అనిత ఉద్దేశపూర్వకంగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచింది. అర్ధరాత్రి సమయంలో ‘కాశీ అంకుల్’ (తరువాత అతడిని అనిత ప్రియుడు కాశీరాం ప్రజాపత్‌గా గుర్తించారు) మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆ సమయంలో వీరూ మంచంపై నిద్రపోతున్నాడు. ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు నిద్రపోతున్న వీరూపై దాడి చేసి, ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇదంతా పక్కనే నిద్రపోతున్నట్టు నటిస్తూ ఆ బాలుడు గమనించాడు.

"నేను అప్పుడే నిద్రలోకి జారుకున్నాను. ఇంతలో తలుపు వద్ద ఏదో చప్పుడు వినిపించింది. కళ్లు తెరిచి చూస్తే అమ్మ తలుపు తీస్తోంది. బయట కాశీ అంకుల్ ఉన్నాడు. అతడితో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నాకు భయమేసింది, నేను లేవలేదు, నిశ్శబ్దంగా అంతా గమనించడం మొదలుపెట్టాను. వాళ్లు మా గదిలోకి వచ్చారు. నేను లేచి చూసేసరికి అమ్మ మంచం ముందు నిలబడి ఉంది. ఆ వ్యక్తులు నాన్నను గుద్దారు, కాళ్లు మెలితిప్పారు, గొంతు కూడా నులిమారు. కాశీ అంకుల్ నాన్న నోటిపై దిండు పెట్టి అదిమాడు. నేను నాన్న వైపు వెళ్లబోతుంటే కాశీ అంకుల్ నన్ను ఎత్తుకుని బెదిరించాడు" అని ఆ బాలుడు పోలీసులకు వివరించాడు. "భయంతో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. కొన్ని నిమిషాల తర్వాత నాన్న చనిపోయాడు. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయారు" అని చెప్పాడు.

వెలుగులోకి వివాహేతర సంబంధం
పోలీసుల కథనం ప్రకారం.. అనిత, కాశీరాం ముందుగానే వీరూ హత్యకు పథకం పన్నారు. వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. అనిత ఖేర్లీలో ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతుండగా, స్థానికంగా కచోరీలు అమ్మే కాశీరాం తరచూ ఆ దుకాణానికి వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరూ హత్య కోసం అనిత, కాశీరాం నలుగురు కిరాయి హంతకులకు రెండు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చినట్టు తెలిసింది. 

అనుమానంతో మొదలైన దర్యాప్తు
మొదట, వీరూ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మరణించాడని అనిత బంధువులకు తెలిపింది. అయితే, మృతదేహంపై స్పష్టంగా కనిపిస్తున్న గాయాలు, విరిగిన పన్ను, ఊపిరాడకుండా చేసిన ఆనవాళ్లు అనుమానాలకు తావిచ్చాయి. వైద్య పరీక్షలో వీరూ హత్యకు గురయ్యాడని నిర్ధారణ అయింది.

ముగ్గురి అరెస్ట్.. కొనసాగుతున్న గాలింపు
మృతుడి సోదరుడు గబ్బర్ జాతవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని 100కు పైగా సీసీటీవీ ఫుటేజ్ క్లిప్‌లను పరిశీలించి, కాల్ డేటా రికార్డులను విశ్లేషించారు. ఈ కేసులో ఇప్పటివరకు మృతుడి భార్య అనిత, ఆమె ప్రియుడు కాశీరాం ప్రజాపత్, కిరాయి హంతకుల్లో ఒకడైన బ్రిజేష్ జాతవ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
Veeru alias Maan Singh Jatav
Anita
Kashiram Prajapat
Rajasthan Alwar Murder
Extra marital affair
Khairli crime news
Murder for hire
Crime news telugu
Alwar district
Rajasthan police

More Telugu News