Fatta-1 Missile: ఇజ్రాయెల్ పై దాడికి కీలక ఆయుధాన్ని తీసిన ఇరాన్.. ఫత్తా-1 మిసైల్ వివరాలు

Irans Fatta 1 Hypersonic Missile Used in Attack on Israel
  • ఇక జాలి చూపించబోమని ఇరాన్ సుప్రీం లీడర్ వ్యాఖ్య
  • హైపర్ సోనిక్ మిసైల్ ఫత్తా-1 మిసైల్ తో దాడులు చేపట్టిన ఇరాన్
  • శబ్ధం కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే ఫత్తా క్షిపణులు
ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధంపై ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. నిన్న రాత్రి జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌పై హైపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించినట్లు వెల్లడించింది. ఇక శత్రువుపై ఎలాంటి జాలి, దయ చూపబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపిన వివరాల ప్రకారం.. "ఆపరేషన్ ఆనెస్ట్ ప్రామిస్ 3"లో భాగంగా 11వ దశ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో హైపర్‌సోనిక్ క్షిపణి "ఫత్తా-1" ను ఉపయోగించినట్లు పేర్కొంది. "ఆక్రమిత భూభాగాల గగనతలంపై ఇరాన్ దళాలు పూర్తి నియంత్రణ సాధించాయి" అని ఐఆర్‌జీసీ ప్రకటించినట్లు సమాచారం. ప్రస్తుత ఘర్షణలో ఇరాన్ తొలిసారిగా ఈ తరహా క్షిపణిని ఉపయోగించింది. 2024 అక్టోబర్ 1న జరిగిన "ఆపరేషన్ ట్రూ ప్రామిస్ II"లో కూడా ఇరాన్ ఫత్తా-1 క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది.

ఫత్తా-1 క్షిపణి ప్రత్యేకతలు ఇవే..
ఇరాన్ 2023లో తొలి హైపర్ సోనిక్ క్షిపణి ఫత్తా-1 ను ఆవిష్కరించింది. దీనికి సుప్రీం లీడర్ ఖమేనీయే పేరు పెట్టారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, యారో వంటి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించేలా ఫత్తా-1ను రూపొందించినట్లు సమాచారం. దీనిని "ఇజ్రాయెల్-స్ట్రైకర్"గా ఐఆర్‌జీసీ అభివర్ణిస్తోంది. ఈ క్షిపణి పొడవు 12 మీటర్లు కాగా, 1,400 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఇది ఘన ఇంధనంతో పనిచేస్తూ, 200 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.

ఫత్తా-1, గంటకు 17,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ) వార్‌హెడ్‌ను కలిగి ఉంది. గాలిలో ఉండగా తమ ప్రయాణ మార్గాన్ని మార్చుకోగల సామర్థ్యం ఈ హైపర్‌ సోనిక్ క్షిపణులకు ఉంటుంది. ఈ ప్రత్యేక సామర్థ్యం కారణంగా వీటిని గుర్తించి, అడ్డగించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. శబ్ద వేగం కన్నా ఐదు రెట్లు వేగంగా.. అంటే సుమారు గంటకు 6,100 కిలోమీటర్ల వేగంతో ఈ క్షిపణులు ప్రయాణిస్తాయి.
Fatta-1 Missile
Iran
Israel
Hypersonic Missile
Iran Israel Conflict
Operation Honest Promise 3
IRGC
Ayatollah Ali Khamenei
Israel Iron Dome
Middle East Conflict

More Telugu News