WhatsApp: వాట్సాప్‌ను వెంటనే తొలగించండి.. పౌరులకు ఇరాన్ ప్రభుత్వ హెచ్చరిక!

Iran Warns Citizens to Delete WhatsApp Over Israel Data Concerns
  • యూజర్ల డేటాను వాట్సాప్ ఇజ్రాయెల్‌కు చేరవేస్తోందని ఇరాన్ ఆరోపణ
  • ఆధారాలు మాత్రం బయటపెట్టని ఇరాన్ ప్రభుత్వం
  • తమ లొకేషన్లు ట్రాక్ చేయమని, సమాచారం పంచుకోమని వాట్సాప్ స్పష్టీకరణ
  • సెల్‌ఫోన్ ట్రాకింగ్‌తోనే తమ సైనికాధికారులు, శాస్త్రవేత్తల హత్యలని ఇరాన్ ఆవేదన
  • టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సీనియర్ సైనికాధికారి అలీ షాద్మానీ మృతి
తమ దేశ ప్రజలు తక్షణమే తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను తొలగించాలని ఇరాన్ ప్రభుత్వం సంచలన సూచన చేసింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్ సేకరించి, ఇజ్రాయెల్‌కు చేరవేస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్ర ఆరోపణలు చేసింది. 

అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట ఆధారాలను ఇరాన్ ప్రభుత్వం బయటపెట్టలేదు. తమ దేశానికి చెందిన కీలక నాయకులు, శాస్త్రవేత్తల కదలికలను సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న ఇజ్రాయెల్, వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని ఇరాన్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఆరోపణలపై వాట్సాప్ మాతృ సంస్థ మెటా స్పందించింది. "ఇలాంటి నిరాధారమైన ఆరోపణల ద్వారా భవిష్యత్తులో మా సేవలను ప్రజలకు అందకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన చెందుతున్నాం. మేము యూజర్ల లొకేషన్లను ట్రాక్ చేయము. వారి కార్యకలాపాలకు సంబంధించిన లాగ్‌లను కూడా మేం నిర్వహించము. వ్యక్తిగత సందేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చూడము. ఏ ప్రభుత్వంతోనూ పెద్ద మొత్తంలో సమాచారాన్ని పంచుకోము" అని వాట్సాప్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 

కీలక నేతల హత్యల వెనుక సెల్‌ఫోన్ ట్రాకింగ్?
తమ దేశానికి చెందిన కీలక సైనిక జనరళ్లు, అణు శాస్త్రవేత్తలను హతమార్చేందుకు ఇజ్రాయెల్ వారి సెల్‌ఫోన్లను ట్రాక్ చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. గతంలో ఇస్మాయిలీ హనియే అనే వ్యక్తిని కూడా టెహ్రాన్‌లో ఇదే విధంగా హత్య చేశారని గుర్తు చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినప్పటికీ, అవి తమ లొకేషన్‌ను శత్రువులకు చేరవేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ గూఢచర్య వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి యాంటీ-ట్రాకింగ్ పరిజ్ఞానం ఉన్న ఫోన్లు వాడాలని సూచించింది.

ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సన్నిహిత సలహాదారు అయిన అలీ షాద్మానీ మరణించినట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు ప్రకటించాయి. గతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సీనియర్ సైనికాధికారి అలీ రషీద్ మరణించడంతో ఆయ‌న‌ స్థానంలో అలీ షాద్మానీని ఇటీవలే యుద్ధ సమయంలో దళాల అధిపతిగా ఖమేనీ నియమించారు. షాద్మానీ ఒక రహస్య ప్రదేశంలో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దళాలు ఆయనను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం గమనార్హం.
WhatsApp
Iran government
Israel
Ali Khamenei
Ali Shadmani
cybersecurity
data privacy
meta
social media
cellphone tracking

More Telugu News