Pakistan: పాకిస్థాన్‌లో రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్

Jaffar Express Train Derails After Bomb Blast in Pakistan
  • పట్టాలు తప్పిన‌ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆరు బోగీలు 
  • సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ వద్ద ఘటన
  • రైలు మార్గంలో ఐఈడీ బాంబు అమర్చినట్లు అనుమానం
  • పేలుడు ధాటికి ట్రాక్‌పై మూడు అడుగుల గొయ్యి
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రైలు మార్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై శక్తివంతమైన బాంబు పేలింది. ఈ ఘటనలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు జకోబాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దుండగులు రైలు మార్గంలో ఐఈడీని అమర్చడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమిక స‌మాచారం. పేలుడు తీవ్రతకు రైలు పట్టాలపై సుమారు మూడు అడుగుల లోతైన గొయ్యి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

కాగా, జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు గతంలోనూ దాడులకు గురైంది. ఈ ఏడాది మార్చి నెలలో పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఇదే రైలును హైజాక్ చేసి, వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్ భద్రతా సిబ్బందిని కూడా మిలిటెంట్లు హతమార్చారు. అనంతరం పాక్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి బందీలను విడిపించాయి. ఇప్పుడు మళ్లీ అదే రైలు లక్ష్యంగా దాడి జరగడం కలకలం రేపుతోంది. 
Pakistan
Jaffar Express
Train blast
Railway track
Bomb explosion
Sindh province
Quetta
Peshawar
IED blast
Train derailment

More Telugu News