ICC Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ తేదీ ఇదే!

Womens T20 World Cup 2026 India vs Pakistan Match on June 14
  • 2026 జూన్ 12న ఇంగ్లండ్, శ్రీలంక మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం
  • జూన్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పోరు
  • ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్
  • మొత్తం 12 జట్లు, 33 మ్యాచ్‌లు
  • ఇంగ్లండ్, వేల్స్‌లో ఏడు వేదికలు
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఈరోజు విడుద‌ల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ 2026 జూన్ 12న ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు, శ్రీలంకతో తలపడనుంది. 

ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ప్రతిష్ఠాత్మక ట్రోఫీ కోసం పోటీపడతాయి. గ‌తేడాది ఈ ట్రోఫీని న్యూజిలాండ్ జట్టు గెలుచుకున్న విష‌యం తెలిసిందే. నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో మొత్తం 33 మ్యాచ్‌లు ఇంగ్లండ్, వేల్స్‌లోని ఏడు వేర్వేరు వేదికలపై జరగనున్నాయి.

భారత క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు కూడా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో భారత్, పాకిస్థాన్ మహిళల జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడగా, అందులో 12 సార్లు భారత జట్టే విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2024 అక్టోబర్ 6న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి దాయాదుల పోరు కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ICC Womens T20 World Cup 2026
India vs Pakistan
Womens T20 World Cup
India Womens Cricket
Pakistan Womens Cricket
Edgbaston
England
Cricket Schedule
T20 Cricket

More Telugu News