Chinta Mohan: చంద్రబాబు మాటల మనిషి, అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత: చింతా మోహన్

Chinta Mohan Slams Chandrababus Governance in Andhra Pradesh
  • చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యమన్న చింతామోహన్
  • జగన్ భయంతోనే ప్రజలు చంద్రబాబును గెలిపించారని వ్యాఖ్య
  • ప్రతి పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్ లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణ
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కేవలం మాటల మనిషి మాత్రమేనని, ఆయన హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో శాంతిభద్రతలు, అవినీతి వంటి పలు అంశాలపై ఆయన ఘాటుగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చింతా మోహన్ పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన తెలిపారు. "మూడడుగుల గొయ్యి తీస్తేనే నీళ్లు వచ్చే ప్రాంతంలో 50 అంతస్తుల సచివాలయం కడతారా?" అని ఆయన ప్రశ్నించారు. అమరావతి దేవతల రాజధాని అనడం కూడా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే పేదరికాన్ని, మహిళలపై అత్యాచారాలను, దాడులను అరికట్టలేని చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని చింతా మోహన్ నిలదీశారు. కుప్పంలో ప్రజలు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "జీరో కరప్షన్ అంటున్న చంద్రబాబు పాలనలో ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో, పోలీస్ స్టేషన్‌లో డబ్బులు వసూలు చేస్తున్నారు" అని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చింతా మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. అరకు ప్రాంతంలో మహిళల ముందే గిరిజన పురుషుల మర్మాంగాలను కోస్తున్నారని, కుప్పంలో ఓ నిరుపేద ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారని ఆయన ఉదహరించారు. ఇలాంటి దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. చంద్రబాబుకు బంధుప్రీతి ఎక్కువ" అని ఆయన వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అంటే భయంతోనే ప్రజలు చంద్రబాబు నాయుడును గెలిపించారని, అంతేకానీ వికసిత ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు నిర్మించలేరని చింతా మోహన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబే అడ్డంకిగా మారారని ఆయన దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, పది రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకునే దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. 
Chinta Mohan
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh Politics
Corruption AP
Kuppam
Tribal Attacks AP
YS Jaganmohan Reddy
AP Debt
Telugu News

More Telugu News