Pawan Kalyan: ఫాస్టాగ్ వార్షిక పాస్‌.. ఇదో గేమ్ ఛేంజ‌ర్‌: ప‌వ‌న్ క‌ల్యాణ్

Pawan Kalyan Applauds Fastag Annual Pass System
  • ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
  • ఇది రహదారి ప్రయాణంలో గొప్ప మార్పు తెస్తుందన్న పవన్
  • రూ. 3వేల పాస్‌తో వాహనదారులకు ఆర్థిక వెసులుబాటు
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పవన్ కృతజ్ఞతలు
  • ఆగస్టు 15 నుంచి ఈ నూతన పాస్ విధానం అమలులోకి
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకున్న ఈ నిర్ణయం, భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్థానంలో ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ 'ఎక్స్ (ట్విట్టర్)' వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఫాస్టాగ్ వార్షిక పాస్‌లను ప్రవేశపెట్టాలన్న ప్రయాణికుల చిరకాల డిమాండ్‌కు ఈ నిర్ణయంతో సరైన పరిష్కారం లభించిందని పవన్ పేర్కొన్నారు. టోల్ చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రైవేటు వాహన యజమానులకు ఈ కొత్త విధానం ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

"రూ.3000 వార్షిక పాస్‌తో వాహనదారులకు ఆర్థికంగా ఉపశమనం కలగడమే కాకుండా, దేశవ్యాప్తంగా సున్నితమైన, వేగవంతమైన, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా హైవే ప్రయాణం సాధ్యమవుతుంది" అని జ‌న‌సేనాని పేర్కొన్నారు. 

ముఖ్యంగా టోల్ ప్లాజాల సమీపంలో నివసిస్తూ, తరచూ ప్రయాణించే వారికి ఈ విధానం వల్ల సమయంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి ప్రజాపాలన పట్ల ఉన్న నిబద్ధతకు నితిన్ గడ్కరీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక నిదర్శనమని పవన్ కొనియాడారు.

కాగా, ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌లను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.3000 చెల్లించి ఈ పాస్‌ను పొందవచ్చని ఆయన 'ఎక్స్ (ట్విట్టర్)' లో వెల్లడించారు. గడ్కరీ చేసిన ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్ పైవిధంగా స్పందించారు. 

అయితే, ప్రస్తుతం కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాణిజ్యేతర వాహనాలకు వర్తించేలా కేంద్రం ప్రకటించిన ఈ పాస్‌కు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు, వర్తించే నిబంధనలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Pawan Kalyan
Fastag annual pass
Nitin Gadkari
National highways
Toll tax
AP Deputy CM
Road infrastructure
FASTag
Tolling system

More Telugu News