Nara Lokesh: కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ

Nara Lokesh Meets Union Minister Chirag Paswan
  • కేంద్ర‌మంత్రి పాశ్వాన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన లోకేశ్‌
  • రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించాల‌ని విజ్ఞ‌ప్తి
  • ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామ‌ని పాశ్వాన్ హామీ
  • 'యువగళం' పుస్తకాన్ని చిరాగ్ పాశ్వాన్‌కు అందించిన లోకేశ్‌
పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మంత్రి లోకేశ్‌ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్ల తోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అయితే, పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలని లోకేశ్‌ కోరారు. 

దీనికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ... ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. తిరుపతి ట్రిపుల్ ఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి తాను ఏపీకి వస్తున్నట్లు తెలిపారు. జులై 11, 12 తేదీల్లో రాయలసీమ పర్యటనకు వస్తున్నాన‌ని పాశ్వాన్ చెప్పారు. 

లోకేశ్‌ను కూడా ఆహ్వానించిన మంత్రి పాశ్వాన్‌.. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేద్దామ‌న్నారు. అన్నదాతలకు మేలు చేసేందుకు మోదీజీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 'యువగళం' పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని లోకేశ్‌... చిరాగ్ పాశ్వాన్ కు అందించారు.

Nara Lokesh
Chirag Paswan
Andhra Pradesh
Rayalaseema
Food Processing Industry
Horticulture Hub
Agriculture
Tomato
Mango
Banana

More Telugu News