Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డి ఆ పని చేస్తేనే నామినేషన్లు వేయనిస్తాం: కవిత

Kalvakuntla Kavitha Warns Revanth Reddy on BC Reservations
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న కవిత
  • బీసీ రిజర్వేషన్లకు రేవంత్ అనుమతి తీసుకురావాలని డిమాండ్
  • మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని సూచన
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని, లేనిపక్షంలో ఎన్నికలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు అనుమతి తీసుకువస్తేనే నామినేషన్లు వేయనిస్తాం. లేదంటే ప్రతి వార్డులో వందల సంఖ్యలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తాం" అని కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ, మండలిలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపామని, పార్లమెంటులో ఈ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. "జులై రెండో వారం వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నాం. ఆలోపు అనుమతి రాకపోతే జులై 17 నుంచి రైలు రోకోలు నిర్వహిస్తాం" అని కవిత హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, బొల్లాపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అడ్డుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఆపరేషన్ కగార్" పైన కూడా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతియుత చర్చలు జరపాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్‌కౌంటర్లు అమానవీయ చర్యలని, ఈ ఆపరేషన్‌ను తమ పార్టీతో పాటు తెలంగాణ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని కవిత పేర్కొన్నారు. మావోయిస్టు సమస్యకు చర్చలే పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. 
Kalvakuntla Kavitha
BRS
BC Reservations
Revanth Reddy
Telangana Elections
Local Body Elections
Godavari Banakacherla Project
Operation Kagar
Maoists
Telangana Politics

More Telugu News