Donald Trump: ఇరాన్ ఉద్రిక్తతల నడుమ పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ భేటీ.. ఆసక్తి రేపుతున్న పరిణామం

Donald Trump Hosts Pakistan Army Chief Asim Munir at White House
  • అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్
  • వైట్‌హౌస్‌లో మునీర్‌కు విందు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు 
  • ఒక దేశ సైన్యాధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడి విందు అరుదైన ఘటన
  • ఈ పరిణామం తమ దౌత్య విజయంగా పాక్ అధికారుల భావన
  • భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ మరోసారి వ్యాఖ్య
  • ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఈ భేటీకి ప్రాధాన్యత
అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ అమెరికా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. వైట్‌హౌస్‌లోని కేబినెట్ రూమ్‌లో ట్రంప్, జనరల్ మునీర్‌కు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయడం విశేషం. సాధారణంగా ఒక దేశ సైన్యాధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో ఆతిథ్యం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది.

మూసివేసిన తలుపుల మధ్య చర్చలు.. దౌత్యపరమైన విజయంగా పాక్ భావన
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్‌తో పాకిస్థాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో పాక్ ఆర్మీ చీఫ్ సమావేశం కావడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూసివేసిన తలుపుల మధ్య జరిగిన ఈ విందు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో పాకిస్థాన్ అధ్యక్షులుగా ఉన్న అయూబ్ ఖాన్, జియా ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి వారికి మాత్రమే అమెరికా నుంచి ఇలాంటి ఉన్నత స్థాయి ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు ఒక ఆర్మీ చీఫ్‌గా ఉన్న మునీర్‌కు ఈ గౌరవం దక్కడాన్ని పాకిస్థాన్ అధికారులు తమ దౌత్యపరమైన విజయంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ మ‌ళ్లీ పాత పాటే
మరోవైపు భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తన జోక్యం కీలక పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ పాత పాటే పాడారు. ఈ రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని తానే నివారించానని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ వైపు నుంచి ఆసిఫ్ మునీర్, భారత్ తరఫున ప్రధాని మోదీ తదితరులు యుద్ధాన్ని నివారించేందుకు చొరవ చూపారని ట్రంప్ పేర్కొన్నారు. 

కాగా, జీ7 సదస్సు నుంచి అర్ధాంతరంగా అమెరికాకు తిరిగి వచ్చిన ట్రంప్, ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. కెనడా నుంచి అమెరికాకు రావాలని మోదీని ఆహ్వానించగా, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల వీలుపడదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా పరిణామాలు, ట్రంప్ వ్యాఖ్యలు దక్షిణాసియా రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Donald Trump
Asim Munir
Pakistan Army Chief
Pakistan US relations
Iran Israel tensions
India Pakistan tensions
G7 Summit
Narendra Modi
South Asia politics
US foreign policy

More Telugu News