Donald Trump: భారత్-పాక్ యుద్ధంపై మాట మార్చిన‌ ట్రంప్

Donald Trump Changes Stance on India Pakistan Conflict
  • భారత్-పాక్ యుద్ధంపై గంటల వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు మాట మార్పు
  • తానే యుద్ధాన్ని ఆపేశానంటూ తొలుత ట్రంప్ వ్యాఖ్యలు
  • ఆ తర్వాత ఇద్దరు నేతల వల్లే ఘర్షణ సద్దుమణిగిందంటూ కొత్త ప్రకటన
  • ట్రంప్ వాదనను తోసిపుచ్చిన మోదీ
  • అమెరికా మధ్యవర్తిత్వం లేదని స్పష్టీకరణ
  • పాక్‌ ఆర్మీ చీఫ్ తో వాషింగ్టన్‌లో ట్రంప్ ప్రత్యేక సమావేశం
  • మోదీ, మునీర్ సమయస్ఫూర్తితోనే అణు ముప్పు తప్పిందని ట్రంప్ కితాబు
గత నెలలో భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటల వ్యవధిలోనే తన వైఖరిని మార్చుకున్నారు. తొలుత తానే యుద్ధాన్ని ఆపేశానని ప్రకటించిన ఆయన, ఆ తర్వాత ఇరు దేశాలకు చెందిన ఇద్దరు తెలివైన వ్యక్తుల వల్లే అణు యుద్ధం తప్పిందని వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయంలో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని భారత్ స్పష్టం చేసింది.

బుధవారం ఉదయం వైట్‌హౌస్ లాన్‌లో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ... "భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపేశాను. దీనికి నాకు సరైన గుర్తింపు లభించలేదు" అని అన్నారు. అయితే, సుమారు ఐదు గంటల తర్వాత  పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో వైట్‌హౌస్‌లో జరిగిన భేటీ అనంతరం ఆయన మాట మార్చారు. 

ఓవల్ కార్యాలయంలో జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ సభ్యులతో సమావేశమైన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... "ఇద్దరు తెలివైన వ్యక్తులు, వారి సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి ఆ యుద్ధానికి ముగింపు పలికారు. అందుకు నేను సంతోషిస్తున్నాను. వారు ఇద్దరూ చాలా తెలివైనవారు. అందుకే అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉన్న ఆ ఘర్షణను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు" అని వివరించారు. ఈ క్రమంలో తన మధ్యవర్తిత్వ పాత్ర గురించి ఆయన ప్రస్తావించలేదు.

అంతకుముందు మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో ప్ర‌ధాని మోదీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని, ఉద్రిక్తతల నివారణకు పాకిస్థానే నేరుగా చర్చలు ప్రారంభించిందని ట్రంప్‌కు ప్రధాని తేల్చిచెప్పినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

"భారత్ తీసుకున్న దృఢమైన చర్యల కారణంగా, సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని పాకిస్థాన్ అభ్యర్థించాల్సి వచ్చింది" అని ప్రధాని మోదీ ట్రంప్‌కు వివరించినట్లు సమాచారం. పాకిస్థాన్‌ విషయంలో మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించబోదని కూడా ఆయన స్పష్టం చేశారు.

బుధవారం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో జరిగిన లంచ్ మీటింగ్ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ... "భారత్, పాకిస్థాన్ యుద్ధంలోకి వెళ్లకుండా దాన్ని ముగించినందుకు ఆయనకు (మునీర్‌కు) ధన్యవాదాలు చెప్పడానికే ఇక్కడికి ఆహ్వానించాను" అన్నారు. "పాకిస్థాన్ వైపు నుంచి దీనిని ఆపడంలో ఈ వ్యక్తి (మునీర్) అత్యంత ప్రభావం చూపారు. అలాగే భారత్ వైపు నుంచి ప్రధాని మోదీ, ఇతరులు కూడా" అని ట్రంప్ పేర్కొన్నారు. 
Donald Trump
India Pakistan conflict
Asim Munir
Narendra Modi
India Pakistan war
US mediation
Nuclear war
White House
Pakistan Army chief
India US relations

More Telugu News