Honey Trapping: బిల్డర్‌ను హనీట్రాప్ చేసి కోట్లు డిమాండ్ చేసిన సోషల్ మీడియా స్టార్ అరెస్ట్

Social Media Star Kirti Patel Arrested for Honey Trapping Builder
  • పది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న కీర్తి పటేల్
  • అహ్మదాబాద్‌లో సూరత్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి
  • కీర్తిపై భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడినట్టు మరిన్ని ఆరోపణలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 13 లక్షల మంది ఫాలోవర్లు
ఓ ప్రముఖ బిల్డర్‌ను హనీట్రాప్ చేసి, కోట్లాది రూపాయలు గుంజాలని ప్రయత్నించి, గత పది నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కీర్తి పటేల్‌ను అహ్మదాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఈమెపై గతేడాది జూన్ 2న సూరత్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత కొద్ది కాలానికే కోర్టు ఆమెపై వారెంట్ కూడా జారీ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సూరత్‌కు చెందిన ఒక బిల్డర్‌ను కీర్తి పటేల్ హనీట్రాప్ చేసిందని, ఆపై అతడిని బ్లాక్‌మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలు డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కీర్తితో పాటు మరో నలుగురి పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చామని, వారిని ఇప్పటికే అరెస్ట్ చేశామని ఒక అధికారి వివరించారు. ఈమెపై భూకబ్జాలు, బెదిరించి డబ్బు వసూలు చేయడం వంటి ఇతర ఆరోపణలతో కూడా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

సూరత్ కోర్టు వారెంట్ జారీ చేసినప్పటికీ, కీర్తి పటేల్ నిరంతరం నగరాలు మారుతూ, తన ఫోన్‌లో వేర్వేరు సిమ్ కార్డులు ఉపయోగిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగింది. బుధవారం అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో ఆమె ఆచూకీని గుర్తించిన సూరత్ పోలీసులు, స్థానిక పోలీసుల సహకారంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ అరెస్ట్ గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ మాట్లాడుతూ... "గత 10 నెలలుగా కీర్తి పటేల్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మా టెక్నికల్ టీమ్, సైబర్ నిపుణుల సహాయంతో ఆమె అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్‌లో ఉన్నట్టు గుర్తించాం. వెంటనే అహ్మదాబాద్ పోలీసులను సంప్రదించి ఆమెను అరెస్ట్ చేశాం. హనీట్రాప్, డబ్బు గుంజడం వంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ పది నెలల్లో ఆమె గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరంతరం తన ఆచూకీ మార్చుకుంటూ వచ్చింది. 

ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్లు, సిమ్ కార్డులు కూడా తరచూ మార్చేసింది. ఆమె లొకేషన్ తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌తో కూడా సమన్వయం చేసుకున్నాం. కీర్తి పటేల్‌పై భూకబ్జాలు, బెదిరించి డబ్బు వసూలు చేయడం వంటి అనేక ఇతర ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో కూడా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి, తదుపరి విచారణ జరుపుతాం" అని ఆయ‌న‌ వివరించారు.

ఇక‌, ఎవరైనా ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటుంటే, నేరుగా పోలీస్ స్టేషన్లలో గానీ, ఏసీపీ లేదా డీసీపీ కార్యాలయాల్లో గానీ ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Honey Trapping
Kirti Patel
Social media influencer
extortion
Ahmedabad arrest
Surat builder
cyber crime
Gujarat police
instagram influencer

More Telugu News