Revanth Reddy: కిషన్ రెడ్డి తెలంగాణ ద్రోహి... హరీశ్ రావు అసూయకు మందు లేదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams Kishan Reddy Calls Him Telangana Betrayer
  • కిషన్ రెడ్డి విశ్వసనీయత పెద్ద ప్రశ్నార్థకమన్న రేవంత్ రెడ్డి
  • బీఆర్ఎస్ ను బతికించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  • ఎన్ని ప్రాజెక్టులకు బీఆర్ఎస్ అనుమతులు తీసుకొచ్చిందో చెప్పాలని డిమాండ్
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని, ఆయన విశ్వసనీయతే ఒక పెద్ద ప్రశ్నార్థకమని సీఎం వ్యాఖ్యానించారు. అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకుండా, ఢిల్లీలో పని ఉందని చెప్పి కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌ను రహస్యంగా కలిశారని విమర్శించారు. సి.ఆర్. పాటిల్‌ను రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాము కూడా పాటిల్‌ను కలుస్తున్నామని, తమతో పాటు రావాలని కోరినా కిషన్ రెడ్డి స్పందించలేదని, అలా వస్తే ఆయన కిరీటం ఏమైనా పోతుందా అంటూ సీఎం ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ను బతికించేందుకే కిషన్ రెడ్డి నీళ్ల సెంటిమెంట్‌ను ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు.

అయితే, అఖిలపక్ష సమావేశానికి వచ్చిన బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావులు ప్రభుత్వ వాదనలకు మద్దతు తెలిపారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వాదనతో వారు ఏకీభవించారని, భవిష్యత్ కార్యాచరణలో ప్రభుత్వానికి సహకరిస్తామని వారు చెప్పారని తెలిపారు. ప్రభుత్వం ఎక్కడికి వెళ్లినా తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని వారు చెప్పారని, వారి మాటల్లో చిత్తశుద్ధి కనిపించిందని సీఎం అన్నారు.

నదీ పరివాహక ప్రాంత అవసరాలు తీరిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని కేటాయించడం, తరలించడం, మళ్లించడం చేయాల్సి ఉంటుందని, అంతర్జాతీయ నీటి చట్టాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని అన్నారు. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలను ఏర్పాటు చేసినా, వాటికి డీపీఆర్‌లు ఇవ్వలేదని పేర్కొన్నారు. జీఆర్ఎంబీకి సమాచారం ఇచ్చాక, తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు పొందాల్సి ఉండగా, అవేవీ పాటించకుండా నేరుగా కేంద్రం నుంచి అనుమతులు పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

మాజీ మంత్రి హరీశ్ రావు అక్కసుకు, అసూయకు మందు లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఐదు నెలలుగా బనకచర్ల విషయంపై నిరంతరం ఫిర్యాదులు చేయడం వల్లే అనుమతులు ఇవ్వడానికి కేంద్రం వెనుకాడుతోందని అన్నారు. తమ ప్రయత్నాల వల్లే అనుమతుల విషయంలో కొంత పురోగతి వచ్చిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎన్ని అనుమతులు తీసుకువచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. 
Revanth Reddy
Kishan Reddy
Telangana
Harish Rao
బీజేపీ
BRS
Godavari River
Water Disputes
Telangana Politics
CR Patil

More Telugu News