Ramakrishna CPI: ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపండి: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

CPI Ramakrishna urges Chandrababu to act against loan app harassment
  • రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై రామకృష్ణ ఆందోళన
  • బలవంతపు రుణ వసూళ్లను అరికట్టాలని సీఎంకు లేఖ
  • తమిళనాడు తరహాలో కఠిన చట్టం తేవాలని సూచన
ఏపీలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలు, ఆన్‌లైన్ మనీ యాప్‌ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని సీపీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమాయక ప్రజలు వీరి వేధింపులకు గురవుతున్నారని, కొన్ని సందర్భాల్లో దాడులకు కూడా తెగబడుతున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో, బలవంతపు రుణ వసూళ్లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. బలవంతపు రుణ వసూళ్లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే ఏపీ శాసనసభలో ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో భర్త చేసిన అప్పు కోసం భార్యను చెట్టుకు కట్టేసిన అమానుష ఘటన వంటివి పునరావృతం కాకుండా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణాల పేరుతో జరుగుతున్న దోపిడీని, దౌర్జన్యాలను అరికట్టాలని రామకృష్ణ తన లేఖలో స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి బిల్లును ఆమోదించిందని ఆయన గుర్తుచేశారు. అప్పులు, వడ్డీలు, చిట్టీల పేరుతో సామాన్యులను పీల్చిపిప్పి చేస్తున్నారని, ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Ramakrishna CPI
Chandrababu Naidu
Andhra Pradesh
Private lenders
Online loan apps
Loan recovery
Debt harassment
Tamil Nadu bill
CPI AP
AP Assembly

More Telugu News