Benjamin Netanyahu: ఇరాన్‌తో తగ్గేదేలే.. మా ధైర్యసాహసాలను ప్రపంచ నేతలు మెచ్చుకుంటున్నారు: నెతన్యాహు

Benjamin Netanyahu Says World Leaders Appreciate Israels Bravery Against Iran
  • ఇరాన్‌పై 'ఆపరేషన్ రైజింగ్ లయన్' ఉధృతం
  • మా సైనిక దళాల విజయాలు ప్ర‌పంచ నేత‌ల‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయ‌న్న ప్ర‌ధాని
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు
  • ఇరాన్ అణు, క్షిపణి ముప్పు నిర్మూలనే లక్ష్యమ‌న్న ప్ర‌ధాని
  • నష్టాలు ఎదురైనా వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశ సైనిక దళాల ధృడ సంకల్పాన్ని, వారు సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఆయన బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు. ఇరాన్ నుంచి ఎదురవుతున్న అణు ముప్పును తిప్పికొట్టే లక్ష్యంతో గత శుక్రవారం 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరిట ఇజ్రాయెల్ ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

ఈ చర్యకు ప్రతిగా టెహ్రాన్ కూడా దూకుడుగా స్పందించడంతో, ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చింది. "నేను ప్రపంచ నాయకులతో మాట్లాడుతున్నాను. మన సైనిక దళాల నిబద్ధత, వారు సాధిస్తున్న విజయాలు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే, ఇజ్రాయెల్ పౌరులైన మీ దృఢమైన స్ఫూర్తి, మీ స్థైర్యం కూడా వారిని అబ్బురపరుస్తున్నాయి" అని నెతన్యాహు పేర్కొన్నారు. 

ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "ఇజ్రాయెల్‌కు గొప్ప మిత్రుడైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు. ఇజ్రాయెల్ గగనతలాన్ని రక్షించుకోవడంలో అమెరికా అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. మేమిద్దరం తరచూ మాట్లాడుకుంటాం. నిన్న రాత్రి కూడా మా మధ్య చాలా స్నేహపూర్వక సంభాషణ జరిగింది. ట్రంప్ మద్దతుకు ధన్యవాదాలు" అని నెతన్యాహు అన్నారు.

ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్ రైజింగ్ లయన్' ద్వారా తమ దేశానికి పొంచి ఉన్న రెండు ప్రధాన ముప్పులను (అణు ముప్పు, బాలిస్టిక్ క్షిపణి ముప్పు) తొలగించడమే లక్ష్యమని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ ముప్పులను తొలగించే దిశగా ఇజ్రాయెల్ దశలవారీగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. "టెహ్రాన్ గగనతలం మా నియంత్రణలోనే ఉంది. అయతొల్లాల ఖ‌మేనీ పాలనపై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నాం. అణు కేంద్రాలు, క్షిపణులు, కమాండ్ సెంటర్లు, పాలన యంత్రాంగానికి సంబంధించిన కీలక ప్రదేశాలపై దాడులు కొనసాగిస్తున్నాం" అని ఆయన వెల్లడించారు.

ఈ పోరాటంలో తాము అనేక నష్టాలను చవిచూస్తున్నామని నెతన్యాహు అంగీకరించారు. "అయినప్పటికీ, మన దేశ అంతర్గత వ్యవస్థ బలంగా ఉంది. ప్రజలు ధృడంగా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం గతంలో కంటే ఇప్పుడు మరింత శక్తివంతంగా ఉంది. ఈ దాడుల వల్ల నష్టపోయిన వారందరికీ సహాయం అందించాలని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను ఆదేశించాను" అని ఆయన తెలిపారు.
Benjamin Netanyahu
Israel
Iran
Operation Rising Lion
Donald Trump
Nuclear Threat
Ballistic Missiles
Middle East Conflict
Israel Defense Forces

More Telugu News