Operation Sindhu: ఇరాన్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిన కేంద్రం.. డీలక్స్ బస్సులు ఏర్పాటు చేయలేదని స్టూడెంట్ల అసంతృప్తి

Indian Students Back From Iran Unhappy With Bus Arrangements
  • ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థుల సురక్షిత తరలింపు
  • 'ఆపరేషన్ సింధు' ద్వారా ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులు
  • స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులపై విద్యార్థుల అసంతృప్తి
  • జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కార్యాలయం స్పందన
ఇరాన్ లో నిత్యం బాంబుల మోతలతో, ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణమొక యుగంలా గడిపారు.. తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తొలుత 110 మందిని ఆర్మేనియాకు, అక్కడి నుంచి ఢిల్లీకి చేర్చింది. ఢిల్లీ నుంచి జమ్మూకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసింది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు.. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు బాగాలేవని అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ చేపట్టింది. ఇరాన్‌లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న 110 మంది విద్యార్థులను అర్మేనియా, దోహా మీదుగా అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రి కేవీ సింగ్ వారికి స్వాగతం పలికారు. "ప్రయాణం చాలా కష్టంగా సాగింది. ముఖ్యంగా టెహ్రాన్‌లో అనేక దాడులు జరిగాయి. మేము ప్రయాణిస్తున్న బస్సుకు సమీపంలో ఒక క్షిపణి పడింది చాలా భయపడ్డాము" అని అలీ అనే విద్యార్థి తన అనుభవాన్ని పంచుకున్నాడు. సురక్షితంగా తరలించినందుకు భారత రాయబార కార్యాలయానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే, ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులు సరిగా లేవని, వాటిలో ప్రయాణించడం కష్టమని కాశ్మీర్‌కు చెందిన షేక్ అఫ్సా అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. మెరుగైన ఏర్పాట్లు చేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కోరినట్లు ఆమె తెలిపారు.

విద్యార్థుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో సమన్వయం చేసుకోవాలని రెసిడెంట్ కమిషనర్‌ను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలు త్వరగా ముగియాలని, తమ చదువులు దెబ్బతింటున్నాయని మరికొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
Operation Sindhu
Iran
Indian Students
Israel Iran Conflict
Urmia Medical University
Armenia
Delhi
Jammu Kashmir
Omar Abdullah
KV Singh

More Telugu News