Ambati Rambabu: జగన్ టూర్ లో అత్యుత్సాహం.. అంబటి రాంబాబుపై కేసు

Police File Case on Ambati Rambabu in Jagan Tour Incident
  • కొర్రపాడు వద్ద బారికేడ్లు తోసేసి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదం
  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎఫ్ఐఆర్
  • కేసు నమోదు చేసిన సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆ పార్టీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహితలోని 188, 332, 353, 427 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈమేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. 

జగన్‌ నిన్న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. వైసీపీ అధినేతకు మద్దతుగా నేతలు, కార్యకర్తలు వాహనాల ర్యాలీ చేపట్టారు. గుంటూరు, నల్లపాడు, మేడికొండూరు మీదుగా పల్నాడు జిల్లా వరకు ర్యాలీ సాగింది. ఈ క్రమంలో కొర్రపాడు శివారులోని ఒక పెట్రోల్‌ బంకు వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. జగన్ కారుతో పాటు ముందున్న వాహనాలను వదిలి వెనకున్న వాహనాలను కొద్దిసేపు ఆపేశారు. రద్దీని నియంత్రించే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు.

వాహనాలు ఆగిపోవడంతో మాజీమంత్రి అంబటి రాంబాబు అక్కడికి చేరుకుని కార్లు ఎందుకు ఆపారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జగన్ కాన్వాయ్ కి ఇబ్బంది కలగకూడదని, ఏటుకూరు వద్ద ప్రమాదంలో వృద్ధుడు చనిపోవడంతో ముందుజాగ్రత్తగా వాహనాలను నిలిపివేశామని పోలీసులు వివరించినా అంబటి రాంబాబు వినిపించుకోలేదు. ఓ దశలో తన సోదరుడు మురళితో కలిసి రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారికేడ్లు నెట్టేశారు. అడ్డుచెప్పిన పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Ambati Rambabu
YS Jagan
Andhra Pradesh
Satthenapalli
Police Case
YSRCP
Road Rally
Law and Order
Guntur
Palnadu

More Telugu News