Jharkhand: భర్తకు విషమిచ్చి చంపిన భార్య.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

Jharkhand Woman Kills Husband with Insecticide in Food
  • ఝార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఘ‌ట‌న‌
  • సమోసాలో పురుగుల మందు కలిపి తినిపించిన వైనం
  • ఈనెల‌ 15న బుద్ధనాథ్ సింగ్ అనుమానాస్పద మృతి
  • మృతుడి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి దారుణం
  • నిందితురాలు సునీతా దేవి అరెస్ట్.. నేరం అంగీకారం
ఇటీవల మేఘాలయలో జరిగిన హనీమూన్ హత్య ఘటన మరువక ముందే, మరో దారుణ ఉదంతం ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. భర్త తినే ఆహారంలో పురుగుల మందు కలిపి ఇచ్చి, అతని మరణానికి కారణమైంది. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని గర్హ్వా జిల్లా బహోకుదర్ గ్రామంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బహోకుదర్ గ్రామానికి చెందిన సునీతా దేవి, తన భర్త బుద్ధనాథ్ సింగ్‌ను ఈ నెల 15న హత్య చేసింది. వ్యవసాయానికి అవసరమని చెప్పి, అంతకు ముందు రోజే ఆమె తన భర్త చేత పురుగుల మందు కొనిపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత భర్త తినే సమోసాలలో ఆ పురుగుల మందును చాకచక్యంగా కలిపింది. సమోసా ముక్క విరిగి ఉండటాన్ని గమనించి బుద్ధనాథ్ సింగ్ ప్రశ్నించగా... సునీతా దేవి మాయమాటలు చెప్పి వాటిని తినిపించింది. అలాగే తానే స్వయంగా చికెన్ వండి భర్తకు ప్రేమగా తినిపించింది.

ఆహారం తిన్న కొద్దిసేపటికే బుద్ధనాథ్ సింగ్‌కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతను అనుమానాస్ప‌ద‌స్థితిలో చ‌నిపోయాడు. ఈ క్ర‌మంలో కోడలు సునీతా దేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతుడి తల్లి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, తమదైన శైలిలో విచారణ చేపట్టారు. సునీతా దేవిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించింది.

గతంలో కూడా రెండుసార్లు తన భర్తను చంపేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు నిందితురాలు విచారణలో వెల్లడించింది. అయితే, ఈ హత్య వెనుక గల స్పష్టమైన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Jharkhand
Sunita Devi
Jharkhand crime
husband murder
poisoning case
Garhwa district
Bahokudar village
insecticide poisoning
domestic violence
crime news India

More Telugu News