QS Rankings 2026: గ్లోబల్ ర్యాంకుల్లో భారత విద్యాసంస్థల ప్రభంజనం.. 54 సంస్థలకు చోటు.. ఐఐటీ ఢిల్లీ టాప్!

QS Rankings 2026 features record 54 Indian institutes IIT Delhi tops
  • క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో దూసుకెళ్లిన‌ భారత విద్యాసంస్థలు
  • దేశంలో ఐఐటీ ఢిల్లీకి అగ్రస్థానం.. ప్రపంచవ్యాప్తంగా 123వ ర్యాంకు
  • గతేడాదితో పోలిస్తే ఐఐటీ ఢిల్లీ ర్యాంకు గణనీయంగా మెరుగు
  • జాబితాలో ఐఐటీ బాంబే 129.. ఐఐటీ మద్రాస్‌కి 180వ స్థానం
  • గత దశాబ్దంలో భారత విద్యాసంస్థల పనితీరులో 390 శాతం వృద్ధి
  • నూతన విద్యా విధానంతో విప్లవాత్మక మార్పులన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ప్రపంచ ప్రఖ్యాత క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 గురువారం విడుదలయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో రికార్డు స్థాయిలో 54 భారతీయ విద్యాసంస్థలు స్థానం దక్కించుకున్నాయి. దేశంలోని విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీ ఢిల్లీ) అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా చూస్తే, ఐఐటీ ఢిల్లీ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకుంది. గతేడాది 150వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 123వ స్థానానికి దూసుకెళ్లింది. క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ ఢిల్లీ ఇప్పటివరకు సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే కావడం విశేషం.

ఈ ఘనతపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ... "భారత ఉన్నత విద్యాసంస్థలు క్యూఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో అపూర్వమైన వృద్ధిని సాధించాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ సంస్థలు ప్రపంచ వేదికపై తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. గత దశాబ్ద కాలంలో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారత్ 390 శాతం అద్భుతమైన వృద్ధిని న‌మోదు చేసింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీ20 దేశంగా అవతరించింది" అని పేర్కొంది. 

గతేడాది ర్యాంకింగ్స్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఐఐటీ బాంబే, ఈసారి ఐఐటీ ఢిల్లీ తర్వాతి స్థానంలో నిలిచింది. 2025 ర్యాంకింగ్స్‌లో 118వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే, ఈ ఏడాది 129వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ఐఐటీ మద్రాస్ తన పనితీరును మెరుగుపరుచుకుంది. 2025లో 227వ ర్యాంకు నుంచి ఏకంగా 47 స్థానాలు ఎగబాకి, 180వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈసారి క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో ఎనిమిది భారతీయ విద్యాసంస్థలు కొత్తగా ప్రవేశించడం గమనార్హం. ఏ ఇతర దేశం నుంచి కూడా ఇన్ని కొత్త సంస్థలు ఈ జాబితాలో చేరలేదు. ఈ తాజా ర్యాంకింగ్స్‌తో అమెరికా, బ్రిట‌న్, చైనా తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఈ ఏడాది ర్యాంకులు పొందిన భారతీయ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 48 శాతం తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి. ఉద్యోగ కల్పనలో ఖ్యాతి (ఎంప్లాయర్ రెప్యుటేషన్) విషయంలో ప్రపంచంలోని టాప్ 100 సంస్థల్లో ఐదు భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి.

ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "2014లో కేవలం 11 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ జాబితాలో ఉండగా, తాజా ర్యాంకింగ్స్‌లో ఆ సంఖ్య 54కు చేరింది. గత దశాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలకు నిదర్శనం. నూతన విద్యా విధానం 2020 (ఎన్‌ఈపీ 2020) మన విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చడమే కాకుండా, విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది" అని అన్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో స్థానం సంపాదించిన ఇతర ప్రముఖ భారతీయ విద్యాసంస్థల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ (215వ ర్యాంకు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరు (219వ ర్యాంకు), ఢిల్లీ యూనివర్సిటీ (328వ ర్యాంకు) ఉన్నాయి. వీటితో పాటు బిట్స్ పిలానీ (668వ ర్యాంకు), ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వంటి ప్రైవేటు సంస్థలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

ఇదిలాఉంటే... ప్రపంచ జాబితాలో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వరుసగా 14వ ఏడాది కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
QS Rankings 2026
IIT Delhi
IIT Delhi QS Ranking
Indian Institutes of Technology
QS World University Rankings 2026
Indian Education System
Dharmendra Pradhan
IIT Bombay
IIT Madras
Ministry of Education India

More Telugu News