Nara Lokesh: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ

Nara Lokesh Meets Former UK Prime Minister Tony Blair
  • ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ
  • నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం 
  • ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష
బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టీబీఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో టోనీ బ్లెయిర్ ను మంత్రి లోకేశ్‌ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించడానికి తమ సంస్థ అయిన టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టీబీఐ) ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు. 

ఆ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలుచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఏపీ విద్యాశాఖ, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ) నడుమ 2024 డిసెంబర్ లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా టీబీఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని మొహరించి రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. 

అందులో 1. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలు 2. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన. ఏపీ విద్యాశాఖ, టీబీఐ నడుమ ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. 

గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GIGG) సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ ను మంత్రి లోకేశ్‌ ఈ సందర్భంగా ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు స‌హకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ అన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Nara Lokesh
Tony Blair
Andhra Pradesh
AP Education
Global Institute for Good Governance
Skill Development
Education Minister
AP Government
TBI
Education Reforms

More Telugu News