YS Jagan: మహిళలంటే ఎవరికి గౌరవం ఉన్నట్లు.. మాకా లేక చంద్రబాబుకా?: జగన్

YS Jagan Questions Chandrababus Respect for Women Safety
  • అక్కాచెల్లెమ్మలకు 32 లక్షల ఇళ్ల పట్టాలను మా ప్రభుత్వం ఇచ్చింది
  • అందులో 22 లక్షల ఇళ్లు సాంక్షన్ చేశాం, 10 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామన్న జగన్
  • నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చేలా చట్టం తీసుకొచ్చామని వ్యాఖ్య
  • అత్యాచారానికి గురైన దళిత బాలికను ఫిర్యాదు చేయకుండా బెదిరించారన్న జగన్
ఆంధ్రప్రదేశ్ లో అక్కాచెల్లెమ్మలకు అండగా ఉన్నది, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలని తపన పడ్డది తమ ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. మహిళలకు సమాన ప్రాధాన్యం దక్కాలని చిత్తశుద్ధితో కృషి చేశామని వివరించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించామని, ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి అమలు చేశామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 32 లక్షల నిరుపేద మహిళలకు వారిపేరుతోనే ఇళ్ల పట్టాలను జారీ చేశామని గుర్తుచేశారు. అందులో 22 లక్షల ఇళ్లను సాంక్షన్ చేసి, పది లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చామని వెల్లడించారు. మహిళలంటే గౌరవం ఎవరికి ఉందనేది ఈ చర్యలతో తెలిసిపోతుందని చెప్పారు.

మహిళలకు చంద్రబాబు చేసిందేంటి?
మహిళల పట్ల చంద్రబాబుకు నిజంగా  గౌరవం ఉందా అని జగన్ ప్రశ్నించారు. నిజంగా మహిళలపై గౌరవం ఉంటే రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే చర్యలు ఎక్కడ తీసుకున్నారని నిలదీశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి ప్రాంతంలో, మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలో ఉన్న ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై దౌర్జన్యం జరిగిన సంగతి జగన్ గుర్తుచేశారు. గ్రామానికి చెందిన దళిత బాలికపై టీడీపీ నేతలు కొందరు సామూహిక అత్యాచారం చేసి బెదిరించారని చెప్పారు. వారి బెదిరింపులకు భయపడి బాధిత కుటుంబం మౌనాన్ని ఆశ్రయించగా.. బాలిక గర్భందాల్చడంతో విషయం బయటపడిందని గుర్తుచేశారు.

అయితే, కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా బాధిత కుటుంబాన్ని నిందితులు బెదిరించారని ఆయన ఆరోపించారు. బాధిత బాలికకు న్యాయం చేయాలనే తపన, నిందితులపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని జగన్ దుయ్యబట్టారు. మరో గిరిజన బాలిక కనిపించకుండా పోతే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఆ తర్వాత ఆ బాలిక శవమై కనిపించిందని గుర్తు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదనే కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారని జగన్ వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక అప్పుడు చంద్రబాబు స్పందించారని విమర్శించారు. ఈ సంఘటనలను బట్టి మహిళలంటే ఎవరికి గౌరవం ఉందో ప్రజలే నిర్ణయించాలని జగన్ అన్నారు.
YS Jagan
Andhra Pradesh
Chandrababu Naidu
Women Empowerment
Dalit Girl
Atrocities Against Women
Womens Safety
YSRCP
TDP
Politics

More Telugu News