Ali Khamenei: ఖమేనీ ఇక ఎంత మాత్రం ఈ భూమ్మీద ఉండడానికి వీల్లేదు: ఇజ్రాయెల్ భీకర ప్రతిజ్ఞ

Ali Khamenei Must Not Live Israel Vows
  • టెల్ అవీవ్ సమీపంలో ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడి
  • ఖొమేనీని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరిక
  • ఆసుపత్రిపై దాడి యుద్ధ నేరమన్న ఇజ్రాయెల్
  • సైనిక స్థావరమే లక్ష్యమని ఇరాన్ వివరణ
  • ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు పెంచాలని ఇజ్రాయెల్ ఆదేశం
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించి, ఆయన పాలనకు చరమగీతం పాడతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెల్ అవీవ్ సమీపంలోని ఓ ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడి ఘటన అనంతరం ఆయన ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడిలో కనీసం 47 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ సహాయక బృందాలు నివేదించాయి.

"పిరికి నియంత ఖమేనీ తన సురక్షిత బంకర్‌లో దాక్కుని ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు, నివాసాలపై క్షిపణులు ప్రయోగిస్తున్నాడు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం. దీనికి ఖమేనీ పూర్తి బాధ్యత వహించాల్సిందే. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖమేనీ ఇక ఎంతమాత్రం ఈ భూమ్మీద ఉండడానికి వీల్లేదు" అని కాట్జ్ 'ఎక్స్' వేదికగా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి, ఖమేనీ పాలనను బలహీనపరిచేందుకు టెహ్రాన్‌లోని ప్రభుత్వ, వ్యూహాత్మక లక్ష్యాలపై దాడుల తీవ్రతను పెంచాలని తాను, ప్రధానమంత్రి కలిసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)ను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని, సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక, గూఢచార స్థావరమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఆసుపత్రికి కేవలం పేలుడు తరంగాల ప్రభావం మాత్రమే తగిలిందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఎన్ఏ పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలువురు సీనియర్ ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు మరణించినట్లు, ఇరాన్‌లోని అణు మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా టెహ్రాన్‌లోని 50కి పైగా లక్ష్యాలు ధ్వంసమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరించింది. తమ దేశం ఎన్నటికీ లొంగిపోదని, బెదిరింపులకు భయపడబోమని ఖొమేనీ ఓ టెలివిజన్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులు మరింత తీవ్రమైన ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Ali Khamenei
Israel
Iran
Israel Katz
Tel Aviv
IDF
Middle East conflict
Iran supreme leader
Israel defense minister
Iran Israel tensions

More Telugu News