Prabhas: ఆ క్షణం చాలా ప్రత్యేకం... ప్రభాస్ పై మాళవిక మోహనన్ ప్రశంసల వర్షం!

Malavika Mohanan Shares Raja Saab Movie Set Experience With Prabhas
  • 'ది రాజాసాబ్' సెట్‌లో ప్రభాస్‌ను తొలిసారి కలిసిన అనుభూతిని పంచుకున్న మాళవిక
  • ఆయన ఎంతో ఆకర్షణీయుడు, ఆప్యాయంగా పలకరించారని వెల్లడి
  • నిద్రలేమితో ఉన్నా ప్రభాస్‌ను చూడగానే ఉత్సాహం ఉరకలేసిందన్న నటి
  • మారుతి దర్శకత్వంలో 'ది రాజాసాబ్' హారర్ ఫాంటసీగా రూపుదిద్దుకుంటున్న చిత్రం
  • ఈ ఏడాది డిసెంబర్ 5న పాన్-ఇండియా స్థాయిలో సినిమా విడుదల
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, విలక్షణ దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ ఫాంటసీ చిత్రం 'ది రాజాసాబ్'. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన మాళవిక మోహనన్, ప్రభాస్‌తో తన తొలి పరిచయం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇటీవల తన అభిమానులతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ముచ్చటించిన ఆమె, పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

'ది రాజాసాబ్' సినిమా సెట్స్‌లో మీకు బాగా నచ్చిన సందర్భం ఏంటి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు మాళవిక స్పందిస్తూ, "ప్రస్తుతం మేమంతా 'ది రాజాసాబ్' టీజర్ సృష్టించిన ఉత్సాహంలో ఉన్నాం కాబట్టి ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాను. మా సినిమా సెట్స్‌లో ప్రభాస్ గారిని మొదటిసారి కలిసిన క్షణం నాకెంతో ప్రత్యేకమైనది" అని తెలిపారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ, "నేను వేరే సినిమా షూటింగ్ ముగించుకుని, అసలు నిద్ర లేకుండానే హైదరాబాద్ వచ్చాను. అప్పుడు చాలా అలసిపోయి, నీరసంగా ఉన్నాను. కానీ, ప్రభాస్ గారిని చూడగానే నాలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది! ఆయన చాలా ఆకర్షణీయంగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించారు. అంతేకాదు, ఆయన అద్భుతమైన సంభాషణా చతురుడు కూడా!" అని ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు.

ఆసక్తికరంగా, 'ది రాజాసాబ్' చిత్రాన్ని భారతదేశంలోనే అతిపెద్ద హారర్-ఫాంటసీ సెట్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం రహస్యాలు, భయంకరమైన నిశ్శబ్దంతో కూడిన ఒక భారీ పురాతన భవంతిని నిర్మించారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌లో ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఒక లుక్‌లో ఎంతో ఉత్సాహంగా, చలాకీగా, స్క్రీన్‌ను డామినేట్ చేసే ఆకర్షణతో కనిపించగా, మరో లుక్‌లో కొన్ని రహస్యమైన, అతీంద్రియ శక్తులున్న వ్యక్తిగా కనిపించారు.

ఈ చిత్రంలో ప్రభాస్, మాళవిక మోహనన్‌లతో పాటు సంజయ్ దత్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. వీరంతా ఈ పురాతన భవంతి కథకు మరింత మిస్టరీని జోడిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. 'ది రాజాసాబ్' ఈ ఏడాది డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా ఎంటర్‌టైనర్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సౌత్ ఇండియాలోని ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరైన థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Prabhas
The Raja Saab
Malavika Mohanan
Maruthi
Telugu cinema
Indian movies
Horror fantasy
Sanjay Dutt
Nidhhi Agerwal
Pan India movie

More Telugu News