Kannappa Movie: 'కన్నప్ప'పై దుష్ప్రచారం చేస్తున్నవారి సంగతి ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు: ఆకెళ్ల

Kannappa Movie Controversy Addressed by Writer Akella Siva Prasad
  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో 'కన్నప్ప'
  • కన్నప్పపై వివాదాలు
  • ప్రకటన విడుదల చేసిన రచయిత ఆకెళ్ల శివప్రసాద్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో, ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం కన్నప్ప. ఇటీవల కాలంలో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో కన్నప్ప కూడా ఒకటి. ఈ సినిమాపై కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణులను కించపరిచారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రచయిత ఆకెళ్ల శివప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.

"తెలుగు సినిమా ప్రేక్షకులకి, అన్ని కులాల వారికి, ముఖ్యంగా బ్రాహ్మణ మిత్రులందరికీ... నమస్సులు...!

గత కొద్ది కాలంగా విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన 'కన్నప్ప' చిత్రం మీద జరుగుతున్న దుష్ప్ర చారాన్ని చూసి సినిమాకి మాటల రచయితగా పనిచేసిన నా మనసుకి ఆవేదన కలిగి, కొన్ని విషయాలు మీతో చెప్పదల్చుకున్నాను.

నా పేరు ఆకెళ్ళ శివప్రసాద్... నేను కూడా బ్రాహ్మణుడినే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ గారు కూడా ఉత్తర భారత దేశానికి చెందిన బ్రాహ్మణులు. టీవీ సీరియల్ గా మహాభారతాన్ని అత్యద్భుతంగా తీసిన దర్శకులు. ఈ చిత్రంలో బ్రాహ్మణులని గానీ, ఏ ఇతర కులాల వారిని గానీ కించపరచలేదు.

అలాగే ఇదివరకు కన్నప్ప చరిత్ర మీద వచ్చిన చిత్రాలలో కన్నడ కంఠీరవ రాజ కుమార్ గారు నటించిన 'శ్రీ కాళహస్తి మహత్యం', కృష్ణంరాజు గారు నటించిన 'భక్త కన్నప్ప' చిత్రాలలో గుడిలో ప్రధాన పూజారి మహదేవ శాస్త్రి పాత్రను (మొదటి చిత్రంలో శ్రీ ముదిగొండ లింగమూర్తి గారు, రెండవ దాంట్లో రావుగోపాలరావు గారు పోషించారు) గుడిలో దేవుడి నగలు తీసుకెళ్ళి తన ఉంపుడుగత్తెకు ఇచ్చినట్టుగా చూపించారు. కానీ కన్నప్ప చిత్రంలో కథానాయకుడిగా నటించడమే గాక, కథా రచన చేసిన మంచు విష్ణు మంచు... ధూర్జటి 16వ శతాబ్దంలో రచించిన శ్రీ కాళహస్తి మహత్యం గ్రంథం ఆధారంగా, మోహన్ బాబు గారు పోషించిన మహదేవ శాస్త్రి పాత్రని మహా శివ భక్తుడి పాత్రగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. రేపు సినిమా చూశాక, ప్రేక్షకులందరికీ ఆ విషయం అర్థమవుతుంది.

మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా, చిత్రాన్ని పూర్తి చేశాక కూడా పరమ పవిత్రమైన శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులకి చూపించారు. వారు చిత్రం ఎంతో ఉన్నతంగా ఉందని ప్రశంసించి, మోహన్ బాబు గారిని, విష్ణు గారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

ఇక ఈ చిత్రంలో పాటని రాసిన రామజోగయ్య శాస్త్రి గారితో పాటు ఎందరో బ్రాహ్మణులు వివిధ శాఖలలో పనిచేసారు. ఇంకొక విషయం... ఏ వర్గం వారిని కించపరచడానికి, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి చిత్రాన్ని నిర్మించవలసిన అవసరం ఎవరికీ లేదు. చివరగా, కన్నప్ప చిత్రం ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి, దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు" అంటూ ఆకెళ్ల తన ప్రకటనలో స్పష్టం చేశారు. 
Kannappa Movie
Manchu Vishnu
Akella Siva Prasad
Sri Kalahasti Temple
Bhakta Kannappa
Mohan Babu
Mukesh Kumar Singh
Telugu Movie Controversy
Ramajogayya Sastry

More Telugu News