Amit Shah: ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Amit Shah Says English Speakers Will Be Ashamed Soon
  • ఆంగ్లం వలసవాద బానిసత్వానికి చిహ్నమన్న అమిత్ షా
  • కొన్నాళ్లకు ప్రజలే ఆంగ్లాన్ని తిరస్కరిస్తారని జోస్యం
  • స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతి, వారసత్వాలకు గుర్తింపు అని వ్యాఖ్య
ఆంగ్ల భాషను వలసవాద బానిసత్వానికి ప్రతీకగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడేవారే సిగ్గుపడే పరిస్థితి వస్తుందని, ప్రజలే ఆ భాషను తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు స్థానిక భాషలే నిజమైన గుర్తింపునిస్తాయని, విదేశీ భాషల స్థానాన్ని అవి భర్తీ చేయాలని ఆకాంక్షించారు.

నిన్న ఢిల్లీలో ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి హిందీలో రచించిన ‘మై బూంద్‌ హూ.. ఖుద్‌ సాగర్‌ హూ’ (నేను నీటి బిందువునే కాదు.. సముద్రాన్ని కూడా) అనే పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి, సంస్కృతికి, చరిత్రకు, మతానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాష సరిపోదని అన్నారు. అసంపూర్ణమైన విదేశీ భాషలతో 'సంపూర్ణ భారతం' అనే భావనను ఊహించలేమని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక భారతీయ భాషలే దేశ ఉనికికి కీలకమని నొక్కిచెప్పిన అమిత్ షా, ఆంగ్లం మాట్లాడే వారు త్వరలోనే ఇబ్బందిపడే సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆంగ్లాన్ని వలసవాద బానిసత్వపు గుర్తుగా భావించి, దాన్ని వదిలించుకుంటారని ఆయన జోస్యం చెప్పారు.

కాగా, హిందీని బలవంతంగా రుద్దడాన్ని, నూతన విద్యావిధానంలో భాగంగా ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని (స్థానిక భాష, ఆంగ్లం, హిందీ) తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సహా కొన్ని విపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
Amit Shah
English language
Indian languages
Hindi
Colonialism
Language policy
New Education Policy
Ashutosh Agnihotri
My Boond Hoon Khud Sagar Hoon
DMK

More Telugu News