Nara Lokesh: చంద్రబాబు తలచుకుంటే జగన్ రెండు నిమిషాల్లో జైల్లో ఉంటారు: లోకేశ్

Nara Lokesh Comments Jagan Will Face Jail if Guilty
  • టీడీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపు ఉద్దేశం లేదన్న మంత్రి లోకేశ్
  •  సాక్ష్యాలుంటే జగన్‌తో సహా ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టీకరణ
  • మద్యం, వివేకా హత్య కేసుల్లో జగన్ ప్రమాణం చేస్తారా అని సవాల్
  • ప్రధాని మోదీతో భేటీపై తొలిసారి పెదవి విప్పిన మంత్రి నారా లోకేశ్
  •  సూపర్ సిక్స్ హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణంలో జగన్‌కు ఒక్క పైసా కూడా ముట్టలేదని దేవుడిపై ప్రమాణం చేయగలరా అని బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్‌కు లోకేశ్ సూటి సవాల్ 
మద్యం కుంభకోణంపై జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మద్యం వ్యాపారంలో ఒక్క పైసా కూడా తినలేదని జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలి. ఇదే నా సవాల్. గతంలో వివేకా హత్య కేసులో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తానని, మీరు కూడా రావాలని అలిపిరిలో సవాలు విసిరితే జగన్ పారిపోయారు" అని గుర్తుచేశారు. చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదని, కానీ తాము విధానాల ప్రకారమే వెళ్తామని, ప్రజలు తమను గెలిపించింది పరిపాలించడానికి, సంక్షేమం, అభివృద్ధి చేయడానికి తప్పితే కక్షసాధింపులతో ఎవరినో జైల్లో పెట్టడానికి కాదని స్పష్టం చేశారు. అయితే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, సాక్ష్యాధారాల ప్రకారమే ముందుకు వెళ్తామని హెచ్చరించారు. మద్యం కేసులో త్వరలో చార్జిషీట్ దాఖలు చేస్తారని, మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొనడం జగన్ ప్రభుత్వ హయాంలోని వ్యవహారాలపై దర్యాప్తు ముమ్మరం కానుందనడానికి సంకేతంగా కనిపిస్తోంది.

కక్ష సాధింపులు లేవు.. కానీ చట్టం నుంచి తప్పించుకోలేరు 
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టదని లోకేశ్ పునరుద్ఘాటించారు. "మమ్మల్ని ప్రజలు గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడానికి. అంతేకానీ, కక్ష సాధింపులతో సమయం వృథా చేసుకోం" అని అన్నారు. అయితే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను, చట్ట ఉల్లంఘనలను మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ‘‘చట్టం తనపని తాను చేస్తుంది. సాక్ష్యాధారాలు ఉంటే ఎవరైనా చట్టం ముందు సమానులే’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు. 

 ప్రధానితో భేటీ - యువతకు దిశానిర్దేశం 
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ గురించి లోకేశ్ తొలిసారి ప్రస్తావించారు. ఆ భేటీని ‘అన్‌బిలీవబుల్’గా అభివర్ణించారు. మోదీ తన 25 ఏళ్ల రాజకీయ జీవితానుభవాలను తనతో పంచుకున్నారని తెలిపారు. ‘‘నాన్న నీడ నుంచి బయటకురా, కష్టపడు. భవిష్యత్తు యువకులదే, కష్టపడి ఎదగాలి’’ అని మోదీ తనకు సూచించినట్టు లోకేశ్ పేర్కొన్నారు.  

 రాష్ట్ర అభివృద్ధి.. సంక్షేమానికి ప్రాధాన్యం
గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన అభివృద్ధిని తిరిగి గాడిలో పెడతామని లోకేశ్ స్పష్టం చేశారు. "తల్లికి వందనం కార్యక్రమం దాదాపు 95 శాతం పూర్తయింది. జులై 5 కల్లా మిగిలిన సమస్యలు పరిష్కరించి 100 శాతం పూర్తి చేస్తాం. సూపర్‌సిక్స్ పథకాలను దశలవారీగా అమలు చేస్తాం" అని వివరించారు. జులై చివరి నాటికి విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, అదే రోజు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు రూ. 2000 కోట్లు క్లియర్ చేశామని, కార్యకర్తలపై గత ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.   
Nara Lokesh
Jagan Mohan Reddy
Chandrababu Naidu
TDP Government
Andhra Pradesh Politics
Liquor Case
Vivekananda Reddy Murder Case
Corruption Allegations
AP Education
AP Development

More Telugu News