Pavel Durov: టెలిగ్రామ్ బాస్ సంచలనం.. తన వీర్యదానంతో పుట్టిన 100 మందికి పైగా పిల్లలకు వేల కోట్ల ఆస్తి!

Pavel Durov to Give Billions to Over 100 Children From Sperm Donations
  • పావెల్ డ్యూరోవ్ భారీ ఆస్తి పంపకం నిర్ణయం
  • 100 మందికి పైగా పిల్లలకు 13.9 బిలియన్ల డాలర్ల సంపద
  • స్పెర్మ్ దానం ద్వారా జన్మించిన పిల్లలకూ సమాన హక్కులు
  • పిల్లలకు 30 ఏళ్ల తర్వాతే ఆస్తి అందుబాటులోకి వస్తుందని వెల్లడి
  • సాధారణ జీవితం గడుపుతూ, స్వశక్తితో ఎదగాలన్నదే లక్ష్యమన్న డ్యూరోవ్
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ డ్యూరోవ్ తన భారీ సంపదకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వీర్యదానం ద్వారా జన్మించిన 100 మందికిపైగా పిల్లలు సహా తన వారసులకు 13.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.16 లక్షల కోట్లు) సంపదను పంచనున్నట్టు ప్రకటించారు. ఫ్రాన్స్‌కు చెందిన 'లీ పాయింట్' మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఫోర్బ్స్ కథనం ప్రకారం.. 40 ఏళ్ల ఈ టెక్ కుబేరుడు ముగ్గురు భాగస్వాముల ద్వారా కలిగిన ఆరుగురు పిల్లలతో పాటు, గత 15 ఏళ్లుగా స్పెర్మ్ దానం ద్వారా 12 దేశాల్లో  100 మందికి పైగా పిల్లలకు తండ్రయ్యాడు. ఈ నేపథ్యంలో తన సంపదను పంచుతూ ఇటీవలే వీలునామా రాసినట్టు తెలిపారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద విలువ 13.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

"నా పిల్లల విషయంలో నేను ఎలాంటి తేడా చూపించను. సహజంగా జన్మించినవారు, స్పెర్మ్ దానం ద్వారా జన్మించినవారు అందరూ నా పిల్లలే. వారందరికీ సమాన హక్కులు ఉంటాయి. నా మరణం తర్వాత వారు గొడవ పడకూడదన్నదే నా కోరిక" అని డ్యూరోవ్ 'లీ పాయింట్' మ్యాగజైన్‌కు వివరించారు.

అయితే, ఈ ఆస్తి తన పిల్లలకు వెంటనే దక్కదని, మరో 30 ఏళ్ల తర్వాతే వారికి అందుబాటులోకి వస్తుందని డ్యూరోవ్ స్పష్టం చేశారు. "నా వీలునామాను ఇటీవలే రాశాను. ఇప్పటి నుంచి ముప్పై ఏళ్ల కాలం పూర్తయ్యే వరకు నా పిల్లలకు నా సంపద అందుబాటులో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. వారు సాధారణ ప్రజల్లా జీవించాలి, సొంతంగా నిలదొక్కుకోవాలి, తమపై తాము నమ్మకం పెంచుకోవాలి, సృజనాత్మకంగా ఎదగాలి కానీ, బ్యాంకు ఖాతాపై ఆధారపడకూడదు" అని ఆయన తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్లున్న టెలిగ్రామ్‌ను సృష్టించడమే కాకుండా, తన విలక్షణమైన జీవనశైలితో డ్యూరోవ్ టెక్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను రోజూ తన 11.1 మిలియన్ల టెలిగ్రామ్ ఫాలోవర్లతో సంప్రదింపులు జరుపుతానని, రోజూ 300 పుష్-అప్‌లు, 300 స్క్వాట్‌లు చేస్తానని.. మద్యం, కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉంటానని వెల్లడించారు.

 వివాదాలూ వెన్నంటే..
పావెల్ డ్యూరోవ్‌పై పలు వివాదాలు కూడా ఉన్నాయి. ఆయన ముగ్గురు పిల్లల తల్లి, డ్యూరోవ్ ఆర్థిక సహాయం అందించలేదని, రహస్యంగా మరో జీవితం గడిపాడని, అప్పట్లో మూడేళ్ల వయసున్న తమ కుమారుడిని గది అవతలికి విసిరేంత బలంగా కొట్టాడని ఆరోపిస్తూ 2023, 2024 సంవత్సరాల్లో రెండు క్రిమినల్ ఫిర్యాదులు చేసినట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

గతంలో భావప్రకటనా స్వేచ్ఛ విషయంలో రష్యా ప్రభుత్వంతో డ్యూరోవ్‌కు విభేదాలు తలెత్తాయి. ఆయన స్థాపించిన సోషల్ నెట్‌వర్క్ 'వీకాంటాక్టే' (రష్యా ఫేస్‌బుక్‌గా పిలుస్తారు)లో ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి చెందిన గ్రూపులతో సహా కొన్ని ఉద్యమ గ్రూపులను మూసివేయడానికి నిరాకరించినందుకు రష్యా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. 2017లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఎగతాళి చేస్తూ డ్యూరోవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పుతిన్ షర్ట్‌లెస్ చాలెంజ్’ ప్రారంభించారు.

గత ఏడాది తన ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లో లైంగిక వేధింపులు, డ్రగ్ ట్రాఫికింగ్ నేరాలు విచ్చలవిడిగా సాగడానికి అనుమతించారన్న ఆరోపణలపై ఫ్రెంచ్ అధికారులు ఆయనపై అభియోగాలు మోపారు. అయితే, డ్యూరోవ్ ఆ ఆరోపణలను ఖండించారు. గత వేసవిలో పారిస్ అధికారులు అరెస్ట్ చేసి, ప్రయాణాలపై నిషేధం విధించిన అనంతరం, మార్చిలో తాను దుబాయ్‌లోని తన నివాసానికి తిరిగి వచ్చినట్టు డ్యూరోవ్ తెలిపారు.
Pavel Durov
Telegram
Telegram CEO
Sperm donation
Wealth distribution
Billionaire
Tech entrepreneur
VKontakte
Alexei Navalny
France

More Telugu News