Supreme Court of India: అవినీతి అధికారిని విధుల్లోకి ఎలా అనుమతిస్తాం?: సుప్రీంకోర్టు ప్రశ్న

Supreme Court Questions Allowing Corrupt Official Back on Duty
  • అవినీతి కేసులో దోషిగా తేలిన అధికారి నిర్దోషి అని తేలేవరకు విధుల్లోకి చేరకూడదన్న సుప్రీంకోర్టు
  • ఇలాంటి వారిని విధుల్లోకి అనుమతిస్తే ప్రజా విశ్వాసం దెబ్బతింటుందని వ్యాఖ్య
  • లంచం కేసులో శిక్ష పడిన రైల్వే ఇన్‌స్పెక్టర్ పిటిషన్‌ను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం
అవినీతి కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రభుత్వ అధికారి, ఆ కేసు నుంచి పూర్తిగా నిర్దోషిగా బయటపడే వరకు తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి అవినీతి అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం వల్ల ప్రజా విశ్వాసం దెబ్బతింటుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. లంచం తీసుకున్న కేసులో దోషిగా తేలిన ఒక రైల్వే ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

"అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారిని తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఎందుకు అనుమతించాలి?" అని ధర్మాసనం ప్రశ్నించింది. "ఒకవేళ దోషిగా తేలిన అధికారిని సర్వీసులో కొనసాగనిస్తే, అది వ్యవస్థ పునాదులనే బలహీనపరుస్తుంది. నిజాయితీపరులైన అధికారులను అవమానించడమే అవుతుంది" అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

వివరాల్లోకి వెళితే, గుజరాత్‌లోని విచారణ కోర్టులో లంచం కేసులో దోషిగా తేలిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్, తన శిక్షపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు గుజరాత్ హైకోర్టు ఆయనకు విధించిన జైలు శిక్షను సస్పెండ్ చేసి, బెయిల్ మంజూరు చేసినప్పటికీ, శిక్షను రద్దు చేయడానికి నిరాకరించింది.

పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నితిన్ కుమార్ సిన్హా, విచారణ కోర్టు తన క్లయింట్‌ను దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించడంలో పొరపాటు చేసిందని తెలిపారు. తన క్లయింట్ లంచం డిమాండ్ చేశారని లేదా అంగీకరించారనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వాదించారు. అందువల్ల, శిక్షపై స్టే విధించి, తన క్లయింట్‌ను తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

అయితే, 'కేసీ సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసును ఉటంకిస్తూ ధర్మాసనం, "కేవలం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ పెండింగ్‌లో ఉందన్న కారణంతో శిక్ష పడిన అధికారిని సర్వీసులో కొనసాగించడానికి అనుమతించలేము. అలాంటి ప్రభుత్వ సేవకులను ప్రభుత్వ పదవిలో కొనసాగించడం వల్ల ప్రజా విశ్వాసం దెబ్బతింటుంది" అని స్పష్టం చేసింది. అనంతరం, కోర్టు సదరు ఇన్‌స్పెక్టర్ పిటిషన్‌ను కొట్టివేసింది.

'కేసీ సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. "ఒక ప్రభుత్వోద్యోగి న్యాయస్థానం నిర్వహించిన విచారణ ప్రక్రియ అనంతరం అవినీతికి పాల్పడినట్లు తేలినప్పుడు, ఉన్నత న్యాయస్థానం అతడిని నిర్దోషిగా ప్రకటించే వరకు అతడిని అవినీతిపరుడిగానే పరిగణించాలి" అని ఆ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం నొక్కి చెప్పింది.

Supreme Court of India
Corruption
Government official
Railway Protection Force
Bribery case
Justice Sandeep Mehta
Justice Prasanna B Varale
KC Sareen vs Union of India

More Telugu News