Madhya Pradesh: షాకింగ్‌ ఘటన.. యువకుడిని కరిచి.. నిమిషాల్లోనే చనిపోయిన విష‌పూరిత పాము!

Venomous Snake Dies 5 Minutes After Biting Man In Madhya Pradeshs Balaghat
  • మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఘటన
  • వ్యక్తిని కాటువేసిన పాము ఐదు నిమిషాల్లోనే మృతి
  • ఏడేళ్లుగా వివిధ చెట్ల పుల్లలతో దంతధావన చేస్తున్న యువకుడు
  • అతని రక్తం విషతుల్యం కావడం వల్లేనని బాధితుడి అనుమానం
  • పాము విషపుతిత్తి పగలడమూ కారణం కావచ్చన్న అటవీ అధికారి
లోకంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కొన్ని సంఘటనలు వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా అవి నిజంగా జరుగుతాయి. అలాంటి ఓ అరుదైన, విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఓ వ్యక్తిని కాటువేసిన పాము, కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. ఈ వింత ఘటన బాలాఘాట్ జిల్లాలోని ఖుద్సోడి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖుద్సోడి గ్రామానికి చెందిన సచిన్ నాగ్‌పురే (25) అనే యువకుడు కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ఆ సమయంలో పొలంలో ఉన్న ఓ పాముపై సచిన్ త‌న‌కు తెలియ‌కుండా కాలు వేశాడు. దీంతో ఆ సర్పం అతడిని కాటువేసింది. అయితే, ఆశ్చర్యకరంగా కాటువేసిన ఐదారు నిమిషాల్లోనే ఆ పాము అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది.

ఈ ఘటనతో షాక్‌కు గురైన సచిన్ వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. హుటాహుటిన పొలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, సచిన్‌తో పాటు చనిపోయిన పామును కూడా తీసుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సచిన్‌ను కాటువేసింది సాధారణ పాము కాదని, అత్యంత విషపూరితమైన డొంగర్‌బేలియా జాతికి చెందిన సర్పమని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం సచిన్ జిల్లా ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.

మనిషిని కాటువేసిన పాము వెంటనే చనిపోవడం అత్యంత అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపై సచిన్ మాట్లాడుతూ.. తాను గత ఏడెనిమిది సంవత్సరాలుగా చిడ్చిడియా, పిసుండి, పల్సా, నేరేడు, మామిడి, తూవర్, ఆజన్, కానుగ, వేప వంటి అనేక రకాల చెట్ల పుల్లలతోనే పళ్లు తోముకుంటున్నానని తెలిపాడు. ఈ మూలికా వృక్షాల కలయిక వల్ల తన రక్తం పాముకు విషపూరితంగా మారి ఉండవచ్చని, అందుకే అది చనిపోయి ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు.

ఈ ఘటనపై అటవీశాఖ రేంజర్ ధర్మేంద్ర బిసెన్ స్పందిస్తూ, ఇది అత్యంత అరుదైన కేసు అని అన్నారు. ఒక వ్యక్తిని కరిచిన వెంటనే పాము చనిపోవడానికి కొన్ని అసాధారణ పరిస్థితులు దోహదం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. కొన్నిసార్లు కాటు వేసిన తర్వాత పాము తన శరీరాన్ని బలంగా మెలితిప్పినప్పుడు దాని విషపుతిత్తి (venom sac) పగిలిపోయే అవకాశం ఉందని, ఇది కూడా పాము ఆకస్మిక మరణానికి దారితీయవచ్చని ఆయన వివ‌రించారు. 
Madhya Pradesh
Sachin Nagpure
snake bite
snake death
venomous snake
Khudsohdi village
Dongarbelia snake
herbal medicine
forest department

More Telugu News