Jagan: జగన్ వ్యాఖ్యలను ఖండించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘం

Kamma Global Federation Condemns Jagans Comments
  • కమ్మవారు ఒక పార్టీకే పరిమితమా అన్న జగన్
  • కమ్మవారు అన్ని పార్టీల్లో ఉన్నారన్న కమ్మ సంఘాలు
  • విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని జగన్ కు హితవు
వైసీపీ అధినేత జగన్ ఇటీవల కమ్మ సామాజికవర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. "కమ్మవారు ఒక పార్టీలోనే ఉండాలా?" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కమ్మ సంఘాల నేతలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

కమ్మవారి సేవా సమితి ఉపాధ్యక్షులు గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ, కమ్మవారు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, వైసీపీలో కూడా కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రలో కమ్మ కులం గురించి ప్రస్తావించడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని వంటి వారితో తమనే తిట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నారా భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా దూషించారని గుర్తుచేశారు. అమరావతిని కమ్మరావతిగా అభివర్ణించారని, ప్రభుత్వ అధికారులకు కులాలను అంటగట్టి అవమానించారని మండిపడ్డారు. 

"రాజకీయాలు మాట్లాడుకోండి, అంతేకానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దు" అని జగన్‌కు హితవు పలికారు. ఓదార్పు యాత్రలో "నరికేస్తాం" అంటూ వ్యాఖ్యలు చేసిన వారిని ఖండించకపోగా, ఆ వ్యాఖ్యలకు జగన్ సంతోషపడ్డారని విమర్శించారు. జగన్ తన విధానాలు మార్చుకోవాలని, మతాలు, కులాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని, ఆయన వైఖరి ఇలాగే కొనసాగితే పొరపాటున కూడా అధికారంలోకి రారని తేల్చిచెప్పారు. ప్రజలు జగన్ వస్తున్నారంటేనే భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. అన్ని కులాలను సమానంగా చూడాలని, అన్ని కులాల వారు ఓట్లు వేస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారని రామకృష్ణ పేర్కొన్నారు.

కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ, జగన్ తన రాజకీయ పర్యటనలో రాజకీయాలు మాట్లాడాలి కానీ, ఒక కులం ప్రస్తావన తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని, అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు. రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి కమ్మవారిపై ఇతర కులాల వారికి విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. జగన్ ప్రతి విషయానికి కమ్మ కులాన్ని ఆపాదిస్తున్నారని విమర్శించారు. "మీ కంటే ముందు అనేక రెడ్డి కులస్తులు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏ ఒక్కరూ కూడా కమ్మ కులస్తులను ద్వేషించలేదు. సమాజ సేవకు కమ్మ కులస్తులు కట్టుబడి ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రమోషన్లు రావాల్సిన కమ్మ అధికారులను మీరు ఏ విధంగా అడ్డుకున్నారో అందరికీ తెలుసు. సమాజంలో ద్వేషాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేలా చేసేవారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి" అని సుధాకర్ డిమాండ్ చేశారు.

కమ్మ సేవా సమితి ప్రతినిధి సూరపనేని స్వరూప రాణి మాట్లాడుతూ, జగన్‌ పరామర్శ యాత్ర ఉద్దేశ్యం ప్రజలను రెచ్చగొట్టడమేనని ఆరోపించారు. పోలీసుల సూచనలు పాటించకుండా వందల మందిని పోగుచేసి, ప్రజలను, పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యలపై భవిష్యత్తులో సమావేశాలు నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెంటపాళ్ల పర్యటనలో 2029లో అధికారంలోకి వస్తే అందరినీ నరుకుతామంటూ ప్లకార్డులు ప్రదర్శించారని గుర్తుచేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, భయం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంటే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రెంటపాళ్లలో వైసీపీ వ్యవహారశైలిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండిస్తే, అందులో తప్పేముందని జగన్ మాట్లాడుతున్నారని, ఇటువంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కమ్మ సామాజిక వర్గాన్ని అవమానించకుండా చూడాలనేది కమ్మ వారి సేవా సమాఖ్య ప్రధాన డిమాండ్ అని స్వరూప రాణి స్పష్టం చేశారు.
Jagan
Jagan Mohan Reddy
Kamma Global Federation
Andhra Pradesh Kamma Sangham
Kamma Community
YS Jagan Comments
Gummadi Ramakrishna
Puvvada Sudhakar
politics
Andhra Pradesh

More Telugu News