Bhanu Prakash Reddy: మోదీ పర్యటనకు ముందు ఏపీలో ఏదో జరుగుతోందనే దుష్ప్రచారం చేయాలని యత్నించారు: జగన్ పై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్

Bhanu Prakash Reddy Criticizes Jagans Actions in Andhra Pradesh
  • జగన్ ను ప్రజలు అపరిచితుడిగా చూస్తున్నారన్న భానుప్రకాశ్ రెడ్డి
  • ఢిల్లీలో రచ్చ చేసి ఏం సాధించారని ఎద్దేవా
  • రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్ దేనని విమర్శ
వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "జగన్ బయటకు రావాలంటే ఒక శవం లేవాలి... వస్తే రెండు శవాలు లేవాలి" అన్నట్లుగా పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చడంలో ఆరితేరారని, ఇక వారి మిగిలిన జీవితం కొబ్బరిబోండాలు కొట్టుకోవడానికి, పరోటా పిండి కలుపుకోవడానికే సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయ్యుండి, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్న ప్రచారంతో ఏదో జరిగిపోతోందని చూపించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 40 రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి నానా రచ్చ చేసి ఏమి సాధించారని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు ముందే ఏపీలో ఏదో జరిగిపోతోందనే దుష్ప్రచారం చేయాలని చూశారని ఆరోపించారు. జగన్‌ను రాష్ట్ర ప్రజలు ఒక అపరిచితుడిగా చూస్తున్నారని, రాజకీయాలకు అనర్హుడని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

"రపా రపా నరికితే తప్పేంటి అంటారా?" అంటూ జగన్ తీరుపై భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదనిపిస్తోందన్నారు. చిన్నపిల్లలు చాక్లెట్లు అడిగినట్లు ప్రతిపక్ష హోదా కోసం రచ్చ చేశారని దుయ్యబట్టారు. 

రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందని విమర్శించారు. జగన్ సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి తమకు కనీసం ఏడాది సమయం పడుతుందని అంచనా వేశారు. ఇక వైసీపీ చరిత్రలో జైళ్లు, ఓదార్పు యాత్రలు తప్ప విజయోత్సవాలు, జైత్రయాత్రలు ఉండవని ఆయన జోస్యం చెప్పారు. జగన్‌ను నమ్మి వెంట నడిచిన నేతలందరినీ, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపించారని వ్యాఖ్యానించారు.

ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. చట్టాలను ఎవరు ఉల్లంఘించినా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, చట్టపరిధిలో తమకున్న అధికారాలతో రౌడీ మూకల ఆగడాలను అణచివేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 
Bhanu Prakash Reddy
YS Jagan
Andhra Pradesh
BJP
YSRCP
Chandrababu Naidu
AP Politics
Nellore
Narendra Modi
TDP

More Telugu News