Kavitha Kalvakuntla: ఆ ఐదు పంచాయతీలు తెలంగాణకు అప్పగించాలి: పోలవరం ముంపు గ్రామాలపై కవిత ఆందోళన

Kavitha Demands Transfer of Five Panchayats to Telangana Over Polavaram Concerns
  • పోలవరం ప్రాజెక్టు నిర్వహణను ఉమ్మడి ఏపీలోనే వ్యతిరేకించామన్న కవిత
  • తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీకి అన్యాయంగా అప్పగించారని ఆరోపణ
  • పోలవరం సామర్థ్యం పెంచడంతో ముంపు పెరుగుతోందని ఆందోళన
  • ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్
  • జూన్ 25న ప్రధాని సమావేశంలో ఈ విషయం ప్రకటించాలని విజ్ఞప్తి
పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించ తలపెట్టిన 'ప్రగతి ఎజెండా' సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేయాలని ఆమె కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడే తాము వ్యతిరేకించామని కవిత గుర్తుచేశారు. అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని ఆమె అన్నారు.

"2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారు. దీంతోపాటు 460 మెగావాట్ల సామర్థ్యం ఉన్న లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టును కూడా ఏపీకే ఇచ్చేశారు" అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్లమెంటులో పోరాటం చేశామని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బంద్‌కు పిలుపునిచ్చినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవడం వల్ల ముంపు సమస్య తీవ్రమవుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి, తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కిచెప్పారు.

ముఖ్యంగా పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. "రాబోయే జూన్ 25వ తేదీన ప్రధాని మోదీ నాలుగు రాష్ట్రాల సీఎంలతో 'ప్రగతి ఎజెండా' పేరిట సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో ఈ ఐదు పంచాయతీలను తెలంగాణకు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించాలి" అని కవిత స్పష్టం చేశారు.
Kavitha Kalvakuntla
Polavaram project
Telangana
Andhra Pradesh
BRS
Narendra Modi
Purushothampatnam

More Telugu News