Pawan Kalyan: అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే... అది మర్చిపోవద్దు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Warns Against Supporting Anti Social Elements
  • అప్రజాస్వామికంగా మాట్లాడే వారిని ప్రజలు గమనించాలని పవన్ సూచన
  • మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
  • సినిమా డైలాగులు నిజ జీవితంలో కుదరవని హితవు
  • అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక
  • శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం
  • రౌడీ షీట్లు తెరిచి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అణచివేస్తామన్న పవన్
రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించేవారిని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. అటువంటి వారిని ప్రజలు నిశితంగా గమనించాలని, అసాంఘిక శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ సినిమా డైలాగులతో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ గురువారం మీడియా ద్వారా స్పందించారు.

చట్టవిరుద్ధ కార్యకలాపాలను కట్టడి చేయకపోగా, వాటిని సమర్థించేలా మాట్లాడే వారి నేరపూరిత ఆలోచనలను ప్రజలు గమనించాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమేనన్న విషయాన్ని ఎవరూ మరచిపోరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.

సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, వాటిని నిజ జీవితంలో అమలుచేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదని ఆయన హితవు పలికారు. చట్టం, నియమ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని నొక్కిచెప్పారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.

ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ప్రవర్తించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 


Pawan Kalyan
Pawan Kalyan comments
YS Jagan Mohan Reddy
Andhra Pradesh politics
anti-social elements
law and order
rowdy sheets
TDP
Janasena
political speech

More Telugu News