Konda Murali: వరంగల్ కాంగ్రెస్‌లో కొండా మురళి వ్యాఖ్యల దుమారం.. కడియం, రేవూరి ప్రకాశ్ రెడ్డి కీలక సమావేశం!

Konda Murali Remarks Spark Controversy in Warangal Congress
  • వరంగల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల అత్యవసర భేటీ
  • కొండా మురళి వ్యాఖ్యలపై నేతల తీవ్ర ఆగ్రహం
  • పరకాల నుంచి కుమార్తె పోటీ చేస్తుందని మురళి ప్రకటన
  • కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై మురళి విమర్శలు
  • కొందరు నేతలు పార్టీలు మారి పదవులు అనుభవించారంటూ వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లోని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు.

ఈ కీలక సమావేశానికి మంత్రులు కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, విజయరామారావు, మాజీ ఎంపీ సుధారాణి హాజరయ్యారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, పార్టీలోని సీనియర్ నేతలను ఉద్దేశించి ఆయన చేసిన ఆరోపణలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

వివాదానికి దారితీసిన వ్యాఖ్యలు ఇవే

గురువారం వరంగల్ నగరంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తన కుమార్తె సుస్మిత పోటీ చేస్తుందని ప్రకటించారు. అదే సమయంలో పార్టీలోని కొందరు సీనియర్ నేతలపై, ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

"వరంగల్‌లో కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించారు. ఆ పార్టీని భ్రష్టు పట్టించారు. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్‌ల వద్దకు చేరి వారిని కూడా తప్పుదోవ పట్టించి, నాశనం చేశారు" అని కొండా మురళి వ్యాఖ్యానించారు. వారిలో ఒకరు గతంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, "పరకాలలో 75 ఏళ్ల నాయకుడొకరు నా దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చేసారి మీకు వదిలేస్తానని చెప్పారు" అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. సొంత పార్టీ నేతలపైనే ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం, టికెట్ల కేటాయింపుపై ఏకపక్షంగా ప్రకటన చేయడం పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా భేటీ అయి, కొండా మురళి వ్యాఖ్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు.
Konda Murali
Warangal Congress
Kadiyam Srihari
Revoori Prakash Reddy
Telangana Congress

More Telugu News