Kichcha Sudeep: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక... కౌంటర్ ఇచ్చిన సినీ నటుడు సుదీప్

Kichcha Sudeep Responds to Deputy CM DK Shivakumars Warning
  • * డీకే శివకుమార్‌ వ్యాఖ్యలపై స్పందించిన కన్నడ నటుడు సుదీప్‌
  • * ఇండస్ట్రీ సమస్యలు ఇక్కడివారికే తెలుస్తాయన్న సుదీప్
  • * పరిస్థితి అర్థం చేసుకుని మాట్లాడితే డీకేఎస్‌పై గౌరవం పెరిగేదని వ్యాఖ్య
  • * గత మార్చిలో ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటులు పాల్గొనకపోవడంపై డీకేఎస్ ఆగ్రహం
  • * నటీనటుల తీరు మారకపోతే సరిచేయడం తెలుసంటూ డీకే వార్నింగ్
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కన్నడ సినీ పరిశ్రమ నటీనటుల తీరుపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్‌ స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, సినీ పరిశ్రమ వ్యవహారాలపై అవగాహనతో మాట్లాడితే బాగుండేదని సుదీప్ అభిప్రాయపడ్డారు. "వారి తీరు మారకపోతే ఏ విధంగా సరిచేయాలో నాకు తెలుసు" అని డీకే శివకుమార్ వ్యాఖ్యానించగా, దీనిపై సుదీప్ స్పందించారు.

"మనం ప్రయాణించే కారుకు కూడా అప్పుడప్పుడు నట్లు, బోల్టులు బిగించాల్సి ఉంటుంది. అప్పుడు మనం సరైన మెకానిక్‌ దగ్గరికే వెళతాం, ఎందుకంటే కారు గురించి పూర్తి అవగాహన వారికే ఉంటుంది. అలాగే, సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇక్కడి పరిస్థితులు పూర్తిగా అర్థమవుతాయి" అని సుదీప్‌ అన్నారు.

డీకే శివకుమార్‌ ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని, అయితే ఆయనంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. "ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు, ఇండస్ట్రీలోని పరిస్థితిని కాస్త అర్థం చేసుకుని ఉండాల్సింది. అలా చేసి ఉంటే ఆయనపై నాకున్న గౌరవ మర్యాదలు మరింత రెట్టింపయ్యేవి. ఆయన పిలిచిన ప్రతిసారీ మేమంతా వెళ్లాం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం" అని సుదీప్‌ వివరించారు.

కాగా, ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరు వేదికగా జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమానికి పలువురు నటీనటులు గైర్హాజరయ్యారు. ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "నటీనటులు, దర్శక నిర్మాతలు అందరూ ఒకే తాటిపైకి రావాలి. రాష్ట్రంలో జరిగే కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలి. సినిమా పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు కూడా ఎంతో అవసరం అని అందరూ గుర్తుంచుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. నటీనటుల తీరు మారకపోతే వారిని ఏ విధంగా దారికి తేవాలో కూడా తనకు తెలుసంటూ హెచ్చరించడం చర్చనీయాంశమైంది.
Kichcha Sudeep
DK Shivakumar
Sudeep
Karnataka
Kannada film industry
film festival

More Telugu News