Revanth Reddy: చంద్రబాబుతో చర్చలకు సిద్ధం.. కానీ ఆ హక్కులు వదులుకునే ప్రసక్తి లేదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Ready for Talks with Chandrababu on Godavari Project
  • గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి
  • పీఎఫ్ఆర్ ఇచ్చే ముందు తెలంగాణను సంప్రదించకపోవడమే వివాదానికి కారణమని వెల్లడి
  • ఈ నెల 23న కేబినెట్ సమావేశం అనంతరం ఏపీని చర్చలకు ఆహ్వానిస్తామన్న సీఎం
  • రాష్ట్రాల మధ్య జలవివాదాలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని స్పష్టీకరణ
గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదని, అయితే తెలంగాణ హక్కులను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలుత తెలంగాణను సంప్రదించకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక సాధ్యసాధ్యాల నివేదిక (పీఎఫ్ఆర్) సమర్పించడమే ప్రస్తుత వివాదానికి మూలకారణమని రేవంత్ రెడ్డి అన్నారు.

"పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే మాతో చర్చించి ఉంటే ఈ వివాదం ఉండేది కాదు. కేంద్రానికి ఏపీ నివేదిక ఇవ్వగానే, కేంద్రం కూడా అన్ని రకాల చర్యలకు సిద్ధమవుతోంది" అని ఆయన వివరించారు. ఈ అంశంపై చర్చించేందుకు తమకు ఎలాంటి బేషజాలు లేవని, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై మాట్లాడుకుందామని ఆయన సూచించారు. "ఒక రోజు కాదు, అవసరమైతే నాలుగు రోజులైనా చర్చిద్దాం. రాష్ట్రాల మధ్య జలవివాదాలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయి. న్యాయ, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం" అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుందని, ఈ భేటీలో బనకచర్ల అంశంపై సమగ్రంగా చర్చించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ను అధికారికంగా చర్చలకు ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. "ఒక అడుగు ముందుకేసి మేమే ఏపీని చర్చలకు పిలుస్తాం. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దు. పైన, కింద ఉన్న రాష్ట్రాలతో వివాదం కోరుకోవట్లేదు" అని ఆయన అన్నారు. విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించుకునేందుకు ఇప్పటికే అధికారులు, మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసిందని ఆరోపించారు.

"నీళ్లు, నిధుల పేరిట బీఆర్ఎస్ నేతలు మోసపూరిత సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకున్నారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానని కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలను ఏపీ ఉపయోగించుకుంటే తప్పేంటని కూడా గతంలో వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను ఏపీకి రాసిచ్చింది కేసీఆర్, హరీశ్ రావులే" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను కృష్ణా జలాల్లో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ అడిగితే మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుపడుతున్నారని, ఆయన వాదనలో పసలేదని అన్నారు. 2023లో కేంద్రానికి హరీశ్ రావు రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు అడిగారని గుర్తుచేశారు.

"విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉంది. బనకచర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు. దీనిపై తెలంగాణ అభిప్రాయం తప్పక తీసుకోవాల్సిందే. గోదావరిలో 968 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు తెలంగాణకు ఉంది. కానీ, కేటాయించిన నీటిని వాడుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంతోనే వివాదాలు తలెత్తుతున్నాయి" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వివాద పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని స్పష్టం చేశారు. జూలై 6, 7 తేదీల్లో మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. అధికారం కోల్పోయిన అసహనంతోనే హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని, తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీశ్ రావులేనని పునరుద్ఘాటించారు. కేటీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లైజనింగ్ అధికారిగా పని చేస్తున్నారని, కేసీఆర్‌కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, అమిత్ షా గతంలో అన్నారని గుర్తుచేశారు. దీనిపై కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy
Telangana
Andhra Pradesh
Chandrababu Naidu
Godavari River
Krishna River

More Telugu News